Categories: TOP STORIES

బిల్డాక్స్‌పై రూ.1.6 లక్షల జరిమానా

అనుమతులు తీసుకోకుండా
ఫ్లాట్ల విక్రయాలకు బుకింగ్స్

బిల్డాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై
తెలంగాణ రెరా కన్నెర్ర

జరిమానాతోపాటు బ‌య్య‌ర్‌ చెల్లించిన
మొత్తం వెనక్కి ఇవ్వాలని ఆదేశం

ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులూ తీసుకోకుండా అందులో ఫ్లాట్ల విక్రయానికి బుకింగ్స్ చేస్తున్న బిల్డర్ పై తెలంగాణ రెరా కన్నెర్ర చేసింది. రెరా నిబంధనలు ఉల్లంఘించి బుకింగ్స్ చేస్తున్నందుకు రూ.1.6 లక్షల జరిమానా విధించింది. అలాగే ఫిర్యాదుదారుడు ఫ్లాట్ కొనుగోలు కోసం అడ్వాన్స్ గా చెల్లించిన రూ.2 లక్షలను తిరిగి ఇవ్వాలని స్పష్టం చేసింది.

రెరా అనుమతి లేకుండా బిల్డాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొండాపూర్ లో ది కాంటినెంట్ పేరుతో ప్రాజెక్టు చేపట్టి, మార్కెటింగ్ చేయడంతోపాటు బుకింగ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తోందని శరత అనే వ్యక్తి రెరాలో ఫిర్యాదు చేశారు. ఈ ప్రాజెక్టు గురించి తాను ఫేస్ బుక్ లో చూశానని, తర్వాత కమల్ అనే వ్యక్తితో వాట్సాప్ చాట్ తో వివరాలు తెలుసుకున్నాని పేర్కొన్నారు. అనంతరం బిల్డాక్స్ ఆఫీసులో ఆ కంపెనీ అమ్మకాలు పర్యవేక్షిస్తున్న హెక్సాస్కీ ఇన్ ఫ్రా ప్రాజెక్టు డైరెక్టర్ దామోదర ప్రసాద్ తో మాట్లాడి, ఫ్లాట్ బుకింగ్ చేసుకున్నట్టు వివరించారు.

2028లోగా ప్రాజెక్టు పూర్తి చేసి డెలివరీ ఇస్తామని చెప్పడంతో బుకింగ్ నిమిత్తం ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.2 లక్షలు చెల్లించినట్టు శరత్ తెలిపారు. అయితే, ఆ ప్రాజెక్టుకు సరైన అనుమతులు లేవని, ఆ ప్రాజెక్టు సైట్ కూడా లిటిగేషన్ లో ఉందనే విషయం తెలియడంతో రెరాను ఆశ్రయించారు. అయితే, ఈ వాదనలను బిల్డాక్స్ తోసిపుచ్చింది.

ఫేస్ బుక్ అడ్వర్టైజింగ్ తమకు తెలియదని, అదంతా మోసమని పేర్కొంది. తమ కంపెనీ నుంచి ది కాంటినెంట్ పేరుతో ఎలాంటి ప్రాజెక్టూ లేదని తెలిపింది. అలాగే కమల్, దామోదర ప్రసాద్ అనే వ్యక్తులతో తమకు సంబంధం లేదని వివరించింది. ప్రాజెక్టుకు సంబంధించి తాము ఎలాంటి మొత్తం తీసుకోలేదని స్పష్టంచేసింది. అయితే, తాము ఫిర్యాదుదారుకు రూ.2 లక్షలు చెల్లించేందుకు ప్రయత్నించగా.. ఆయన తమను బ్లాక్ చేయడంతో వీలుపడలేదని తెలిపింది.

అయితే, బ్యాంకు స్టేట్ మెంట్లు సమర్పించాలనే ఆదేశాలు పాటించకపోవడంతో బిల్డాక్స్ సంస్థే అక్రమాలకు పాల్పడినట్టు రెరా నిర్ధారించింది. ఎలాంటి అనుమతులూ తీసుకోకుండా ప్రాజెక్టు మార్కెటింగ్, బుకింగ్ అమౌంట్స్ తీసుకోవడం చేయడం రెరా చట్టాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో బిల్డాక్స్ కు రూ.1.6 లక్షల జరిమానా విధించడంతోపాటు శరత్ కు ఆయన చెల్లించిన మొత్తాన్ని 15 రోజుల్లోగా తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.

బిల్డాక్స్ ప్రీలాంచ్ స్కామ్

సుప్రీం కోర్టులో వివాద‌మున్న‌ భూమిలో.. బిల్డాక్స్ ప్రీలాంచ్ వ్యాపారాన్ని చేస్తున్న‌ద‌ని.. రెజ్ న్యూస్ తొలుత వెలుగులోకి తెచ్చింది. ఆత‌ర్వాత టీజీ రెరా అథారిటీ బిల్డాక్స్‌పై జ‌రిమానా కూడా విధించింది. ఇందులో కొన‌వ‌ద్ద‌ని ఆనాడే బ‌య్య‌ర్ల‌ను హెచ్చ‌రించింది.

This website uses cookies.