తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన కోకాపేట్ భూముల వేలానికి అనూహ్య స్పందన లభిస్తోంది. కోకాపేట్‌లో ఏడు ప్లాట్లతో పాటు గోల్డన్ మైల్‌లో మిగిలిపోయిన ఒక ప్లాటును వేలం వేసేందుకు గత నెలలో ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా హెచ్ఎండీఏ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎకరానికి రూ.25 కోట్లుగా హెచ్ఎండీఏ నిర్ణయించడం.. పైగా కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో.. స్పందన ఎలా ఉంటుందనే సందేహం సర్వత్రా వ్యక్తమైంది. కానీ, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ.. దాదాపు వందకు పైగా కంపెనీలు ఈ వేలంలో పాల్గొంటున్నాయని తెలిసింది. హైదరాబాద్ సంస్థల్ని మినహాయిస్తే ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు చెందిన కంపెనీలు తమ ఆసక్తిని వెల్లడించాయని తెలిసింది.
కోకాపేట్లో భూమిని సొంతం చేసుకునేందుకు ఫార్మా, ఆస్పత్రులు ఆసక్తి చూపిస్తుండగా.. ఆశ్చర్యకరమైన రీతిలో హోటళ్లూ ముందుకొచ్చినట్లు సమాచారం. వీటితో బాటు పలు ఐటీ సంస్థలు కోకాపేట్‌లో స్థలం దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయని తెలిసింది. నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు ఒక బృందంగా ఏర్పడి కోకాపేట్ వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. మొత్తానికి, హెచ్ఎండీఏ కమిషనర్ అంచనా వేసినట్లు.. ఈ కోకాపేట్ వేలం సూపర్ హిట్ అయ్యేందుకు పూర్తి అవకాశం ఉందని చెప్పొచ్చు. తుది గడువు సమీపిస్తున్న కొద్దీ మరెన్ని పెద్ద సంస్థలు ఇందులో పాల్గొంటాయనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.
లాక్ డౌన్ ఎత్తివేసినప్పట్నుంచి హైదరాబాద్‌లో రియల్ కార్యకలాపాలు పుంజుకున్నాయి. కొనుగోలుదారులు నెమ్మదిగా ప్రాజెక్టుల్ని సందర్శించడం ఆరంభించారు. బ్యాంకుల వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంతో ఇప్పటి వరకూ వేచి చూసినవారిలో కొందరు అడుగులు ముందుకేస్తున్నారు. వీరిలో అధిక శాతం మంది ఫ్లాట్లను ఎంచుకున్నవారే కావడం గమనార్హం. కాకపోతే, లాక్ డౌన్ వల్ల కొనుగోలుకు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేయలేకపోయారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రాజెక్టుల సందర్శనలు పెరిగాయని.. మళ్లీ అమ్మకాల్లో సానుకూల దృక్పథం కనిపిస్తోందని జెమ్ కన్‌స్ట్రక్షన్స్ ఎండీ వెంకటేష్ యాదవ్ తెలిపారు. కోకాపేట్ వేలానికి మంచి డిమాండ్ వస్తున్నందుకు సంతోషంగా ఉందని.. వేలం పూర్తయ్యాక కోకాపేట్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందన్నారు. కోకాపేట్లో తమ ప్రాజెక్టు జెమ్ నక్షత్ర శరవేగంగా నిర్మాణ పనుల్ని జరుపుకుంటుందని రియల్ ఎస్టేట్ గురుకి వివరించారు.
This website uses cookies.