- డాక్టర్ లుబ్నా సర్వత్
జంటనగరాల దాహార్తిని తీర్చే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల పరిరిక్షణకు 1996లో ఇచ్చిన ట్రిపుల్ వన్ జీవోలోని పేరా 3ను ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదు. ఈ నిర్ణయానికి అటు చట్టపరంగా గానీ, ఇటు సంబంధిత నిపుణుల నుంచి గానీ ఎలాంటి మద్దతూ లేదు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ వన్ జీవోను ఉల్లంఘిస్తూ చేపట్టిన నిర్మాణాల విషయంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ 2018లో ఇచ్చిన తీర్పు ప్రతి హైదరాబాదీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రిపుల్ జీవోని 2000 సంవత్సరంలో సుప్రీంకోర్టు సైతం సమర్ధించింది. ఈ రెండు జలాశయాలకు 10 కిలోమీటర్ల పరిధిలోని బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణపరమైన ఆంక్షలను తొలగిస్తూ ప్రభుత్వం 2022 ఏప్రిల్ 12న కొత్త జీవో జారీ చేయడానికి కారణం 2018లో జాతీయ హరిత ట్రైబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్ నిర్లక్ష్యమే.
అప్పీల్ వర్సెస్ జడ్జిమెంట్
2017లో సదరన్ బెంచ్ నుంచి జాతీయ హరిత ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్ కు బదిలీ అయిన పిటిషన్ పై ఆ బెంచ్ ఎలా స్పందించిందో గమనించాలి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల బఫర్ జోన్ లోకి వచ్చే 84 గ్రామాల్లో కచ్చితంగా జీవో 111 అమలు చేయాలి. నిజానికి గ్రీన్ ట్రిబ్యునల్ సదరన్ బెంచ్ ముందు 2016 మార్చి 17న జరిగిన వాదనల్లో పలు అంశాలు నివేదించారు. నిషేధిత ప్రాంతాల నుంచి అక్రమ నిర్మాణాలన్నింటినీ తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ, లేక్ పరిరక్షణ కమిటీ, రంగారెడ్డి కలెక్టర్, తహశీల్దార్, జిల్లా పంచాయతీ అధికారి, పంచాయతీ కార్యదర్శిలను ఆదేశించాలని కోరారు. కానీ, అనంతరం దీనిపై 2018 డిసెంబర్ 19న ప్రిన్సిపల్ బెంచ్.. హైపవర్ కమిటీ ఆయా అంశాలపై సమగ్ర పరిశీలన జరిపి ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించాలని తీర్పునిచ్చింది.
ఒకే కేసు.. వేర్వేరు బెంచీల తీర్పులు!
ఒకే కేసులో రెండు వేర్వేరు బెంచ్ లు వెలువరించిన తీర్పులను ప్రస్తావించాలి. 2016లో సదరన్ బెంచ్.. అక్రమ నిర్మాణాలపై యథాతథ స్థితిని ప్రకటించి, అక్రమ నిర్మాణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. కానీ, ప్రిన్సిపల్ బెంచ్ 2018 డిసెంబర్ 15న కేసును పరిష్కరిస్తూ.. ఇది రాష్ట్ర ప్రభుత్వ విధాన పరిధిలోకి వచ్చే అంశం, ఈ దశలో ట్రిబ్యునల్ జోక్యం చేసుకోవడం సమంజసం కాదు అని పేర్కొంది. తద్వారా సుప్రీంకోర్టు సమర్థించిన ట్రిపుల్ వన్ జీవో విషయంలో ప్రిన్సిపల్ బెంచ్ నిర్లక్ష్యం ప్రదర్శించింది. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బెంచ్ ఇలా వ్యవహరించడం పౌరుల్లో గందరగోళానికి కారణమైంది. 2016లో రంగారెడ్డి కలెక్టర్ ఇచ్చిన నివేదికలో అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు నిర్ధారించారు. కానీ, ఈ అంశాన్ని సైతం ప్రిన్సిపల్ బెంచ్ పరిగణనలోకి తీసుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించింది. అవన్నీ అక్రమ నిర్మాణాలే అని కలెక్టర్ నివేదించినప్పుడు వాటిని తొలగించాలని ప్రిన్సిపల్ బెంచ్ ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదు? హైదరాబాదీలకు అస్తిత్వ ముప్పుగా పరిణమించిన ఈ 111 జీవో అంశంలో ఓ బాధ్యతాయుత పౌరులుగా ఈ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించకపోతే మన నగరం, మన రాష్ట్రం, మన దేశం పట్ల మనుకున్న విధేయత ప్రశ్నార్థకంగానే మిగులుతుంది. కాబట్టి, ఇప్పటికైనా ప్రతిఒక్క హైదరాబాదీ 111 జీవోపై గళమెత్తాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ప్రభుత్వం చేసిన ఉల్లంఘనల నుండి పరిహారం కోసం పౌరులు ఎప్పుడూ న్యాయ వ్యవస్థ వైపు చూస్తారు. కాబట్టి, 111 జీవోకు సంబంధించి ఇప్పటివరకూ నిపుణుల ఆదేశాల్ని, సుప్రీం కోర్టు తీర్పును పక్కన పెట్టి.. రెండు జలాశయాలకు సంబంధించిన వాస్తవాల్ని మరుగునపెట్టి.. ప్రభుత్వం ట్రిపుల్ వన్ జీవో 111లోని 3వ పేరాను తొలగించిన అంశాన్ని ఎన్జీటీ ప్రిన్సిపల్ బెంచ్ సుమోటాగా స్వీకరించాలి. తెలంగాణ ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుతూ తీర్పును వెలువరించి తమ ఉనికిని నిలబెట్టుకోవాలి.
(రచయిత స్టేట్ ప్రెసిడెంట్, వాటర్ రిసోర్సెస్ కౌన్సిల్ – విమెన్స్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ)