ఈ రెండింటి మీద కట్టాలి 20 లక్షలుపెరుగుతున్న వాణిజ్య సముదాయాల్ని నిరోధించడానికేమో తెలియదు కానీ.. ప్రభుత్వం వాణిజ్య సముదాయాలపై రిజిస్ట్రేషన్ ఛార్జీలను భారీగా పెంచేసింది. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌లో వీటి ధరను అమాంతం పెంచేసింది. ఏదైనా ఐటీ లేదా వాణిజ్య సముదాయాల్లో.. టాప్ ఫ్లోరుల్లో 1500 చదరపు అడుగుల వాణిజ్య సముదాయం కొంటే.. వివిధ పన్నుల రూపంలో మీరు ఎంతలేదన్నా రూ.20 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అదెలా అంటారా?
పాత ముంబై హైవే, నానక్‌రాంగూడ, గుట్టల బేగంపేట్, మియాపూర్- బొల్లారం రోడ్డు, మంచిరేవుల, నెక్నాంపూర్, నార్సింగి వంటి ప్రాంతాల్లో.. సుమారు కోటీ రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ వెచ్చించి 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య సముదాయాన్ని కొనుగోలు చేస్తే.. ఎంతలేదన్నా రూ.20 లక్షల దాకా ప్రభుత్వానికి వివిధ రుసుముల రూపంలో చెల్లించాలి.
కనీసం కోటీ రూపాయలు అనుకుంటే, దానిపై 12 శాతం జీఎస్టీ కట్టాలి. ఈ మొత్తం సుమారు రూ.12 లక్షలు అవుతుంది. ఆతర్వాత రిజిస్ట్రేషన్ చేయించడానికి వెళితే చదరపు అడుక్కీ రూ.7,300 చొప్పున లెక్కిస్తారు. మళ్లీ, దీనిపై స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ కోసం ఏడున్నర శాతం కట్టాలి. ఇలా లెక్కిస్తే.. సుమారు రూ.8 లక్షలు అవుతుంది. వాణిజ్య సముదాయాన్ని కొనుగోలు చేస్తే ఎలాగూ 12 శాతం జీఎస్టీ కట్టాలి. దీంతో, కోటీ రూపాయలపై ఎంతలేదన్నా రూ.20 లక్షలు కట్టాల్సి ఉంటుంది.
కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, హఫీజ్‌పేట్, ఖాజాగూడ, మదీనాగూడ, బండ్లగూడ జాగీర్ వంటి ప్రాంతాల్లో 1500 చదరపు అడుగుల వాణిజ్య స్థలాన్ని గ్రౌండ్ ఫ్లోరులో కొనుగోలు చేసినా మీ జేబు గుల్లకావడం ఖాయం. అదే, పైన అంతస్తుల్లో కొంటే, కేవలం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలే రూ.5 లక్షల దాకా కట్టాల్సి ఉంటుంది. మొత్తానికి, వాణిజ్య సముదాయాల్లో స్థలం కొనడాన్ని ప్రభుత్వమెంతో భారం చేసింది.
వాణిజ్య సముదాయాల్లో స్థలాన్ని కొనేందుకు ఎక్కువగా ప్రవాసులే ఆసక్తి చూపెడుతుంటారు. మరి, కోటీ రూపాయలు పెట్టుబడి పెడితే రూ.20 లక్షల రుసుమలు కట్టాలంటే ఎవరికైనా భారమే అవుతుంది. అలాంటప్పుడు, పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించే అవకాశం ఉంటుంది. పొరుగు రాష్ట్రాలేమో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గిస్తుంటే.. మన తెలంగాణలో మాత్రం పెంచుతున్నారు. మరి, ఇలాంటి నిర్ణయాలు మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవాలంటే మరికొంత సమయం పడుతుందని చెప్పొచ్చు.
This website uses cookies.