Categories: TOP STORIES

హైద‌రాబాద్‌లో 19 శాతం పెరిగిన ఇళ్ల ధ‌ర‌లు

దేశంలోకెల్లా అన్ని న‌గ‌రాల‌తో పోల్చితే హైద‌రాబాద్‌లోనే ఇళ్ల ధ‌ర‌లు పంతొమ్మిది శాతం పెరిగాయ‌ని క్రెడాయ్‌, కొలియ‌ర్స్‌, ల‌యాసెస్ ఫోర‌స్ హౌసింగ్ ప్రైస్ ట్రాక‌ర్ తాజా నివేదిక వెల్ల‌డించింది. 2023 మూడో త్రైమాసికంలో దేశ‌వ్యాప్తంగా ప‌ది శాతం ఇళ్ల ధ‌ర‌లు పెరిగాయ‌ని.. బెంగ‌ళూరులో ప‌ద్దెనిమిది శాతం అధిక‌మ‌య్యాయ‌ని.. అన్‌సోల్డ్ ఇన్వెంట‌రీ ఢిల్లీ ఎన్సీఆర్ రీజియ‌న్‌లో త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని తెలియ‌జేసింది. ఈ ఏడాది చివ‌రిక‌ల్లా అమ్మ‌కాలు మ‌రింత పెరిగి మార్కెట్ ప‌టిష్ఠ‌మ‌య్యే అవ‌కాశ‌ముంద‌ని నివేదిక వెల్ల‌డించింది. పండ‌గ సీజ‌న్‌లో ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్రోత్సాహ‌కాలు, గృహ‌కొనుగోలుదారుల‌కు లాభ‌దాయ‌క‌మైన ప‌థ‌కాలు వంటివి ప్ర‌త్యేక ప్రోత్సాహాన్నిచ్చాయ‌ని తెలియ‌జేసింది.

క్రెడాయ్ నేష‌న‌ల్ అధ్య‌క్షుడు బొమ‌న్ ఇరానీ మాట్లాడుతూ.. 2023లో ఇళ్ల కొనుగోలుదారుల సెంటిమెంట్ పెరిగింద‌న్నారు. అందుకే ఇళ్ల రిజిస్ట్రేష‌న్లు పెర‌గ‌డంతో పాటు ప‌రోక్షంగా ధ‌ర‌లు పెరిగేందుకు తోడ్ప‌డింద‌న్నారు. ఒక‌వైపు స్థిర‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌, జాబ్ సెక్యూరిటీ, స్థిర‌మైన రుణ వాతావ‌ర‌ణం వంటి అంశాల నేప‌థ్యంలో అమ్మ‌కాల ప‌రంప‌ర ఇదేవిధంగా కొన‌సాగుతుంద‌న్నారు. సుస్థిర‌మైన అభివృద్ధి, హ‌రిత గృహాల నిర్మాణం వంటివి ప‌రిశ్ర‌మ‌లో త‌ర్వాతి స్థాయిలో డెవ‌ల‌ప్ అవుతాయ‌న్నారు. కోల్‌క‌తా, హైద‌రాబాద్‌, ఢిల్లీ ఎన్‌సీఆర్‌, బెంగ‌ళూరు వంటి ప్రాంతాల్లో విశాల‌మైన గృహాల‌కు గిరాకీ పెర‌గ‌డంతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ధ‌ర‌లూ పెరిగాయ‌ని తెలిపారు.

This website uses cookies.