Categories: LATEST UPDATES

ఫ్లెక్స్ మార్కెట్ పరుగులు

  • 2026 నాటికి 80 మిలియన్ చ. అ.లకు చేరే అవకాశం
  • కొలియర్స్ నివేదిక వెల్లడి

మనదేశంలో ఫ్లెక్స్ మార్కెట్ వేగంగా దూసుకెళ్తోంది. 2026 నాటికి ఫ్లెక్స్ స్పేస్ స్టాక్ 80 మిలియన్ చదరపు అడుగులకు చేరుకునే అవకాశం ఉందని కొలియర్స్ నివేదిక పేర్కొంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతూ బలంగా అవతరిస్తుందని తెలిపింది.

దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఫ్లెక్స్ స్టాక్ 2019 నుంచి దాదాపు రెట్టింపు అయి 43.5 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. ఇది మొత్తం గ్రేడ్ ఏ ఆఫీస్ స్టాక్ లో 6.3 శాతం కావడం గమనార్హం. ఆసియా పసిఫిక్ రీజియన్ లోని ఇతర కీలక మార్కెట్ల జోరుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. సానుకూల ఆర్థిక దృక్పథం, పెరుగుతున్న వర్క్ స్పేస్ ట్రెండ్స్, స్పేస్ ఆక్రమణదారుల్లో పెరుగుతున్న వైవిధ్యత వంటి అంశాలు మార్కెట్లో ఫ్లెక్స్ స్పేస్ డిమాండ్ పెంచుతోంది. దేశంలో ఫ్లెక్స్ లీజింగ్ ఇటీవల సంవత్సరాలలో గణనీయంగా ఊపందుకుందని, 2022లో ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 7 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుందని కొలియర్స్ ఇండియా ఫ్లెక్స్ హెడ్ అర్పిత్ మెహ్రతా పేర్కొన్నారు. ఫ్లెక్స్ లీజింగ్ కార్యకలాపాలు 2023లో కూడా కొనసాగుతున్నాయని చెప్పారు.

మొత్తం ఫ్లెక్స్ లీజింగ్ లో బెంగళూరు మూడో వంతు వాటా కలిగి ఉంది. 2023 చివరి నాటికి ఫ్లెక్స్ స్పేస్ లీజింగ్ మొత్తం ఆఫీస్ లీజింగ్ లో 15 నుంచి 20 శాతం ఉంటుందని అంచనా. ఇక దేశంలోని ఫ్లెక్స్ స్టాక్ లో బెంగళూరు మూడో వంతు వాటాతో అతిపెద్ద మార్కెట్ గా ఉంది. తర్వాతి స్థానంలో ఢిల్లీ ఉంది. హైదరాబాద్, పుణెలు కూడా ఈ విషయంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి.

This website uses cookies.