హైదరాబాద్ నిర్మాణ రంగం పనితీరు 2022లో ఎలా ఉంది? ఆశించినంత స్థాయిలో అమ్మకాలు జరిగాయా? 2022 జనవరి నుంచి డిసెంబరులోపు ఏ త్రైమాసికంలో మార్కెట్ ఆశాజనకంగా కనపడింది? ఈ ఏడాది కొత్తగా చోటు చేసుకున్న పోకడలేంటి? వాటి వల్ల జరిగిన కష్టనష్టాలేమిటి? ఇలాంటి కీలకమైన అంశాల్ని తెలుసుకునేందుకు.. రియల్ ఎస్టేట్ గురు పలువురు నిపుణులను ప్రత్యేకంగా పలకరించింది. మరి, వారేమన్నారంటే..
హైదరాబాద్ నిర్మాణ రంగం విషయానికి వస్తే.. 2022వ సంవత్సరం ఫర్వాలేదని చెప్పొచ్చు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల 2022 ప్రారంభంలో కాస్త కల్లోలంగానే ఉండింది. వరల్డ్ వార్ వస్తుందేమోననే ఊహాగానాలు పెరిగాయి. కాకపోతే, ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. రియల్ రంగం స్థిరంగా ముందుకెళ్లింది. ప్రీలాంచులు కాస్త తగ్గుముఖం పడ్డాయి. హైదరాబాద్‌లో మేం ఆకాశహర్మ్యాలు, బహుళ అంతస్తుల భవనాలు, లగ్జరీ విల్లా ప్రాజెక్టు వంటివి నిర్మిస్తున్నాం. మొత్తానికి, 2022లో ఎంతలేదన్నా నాలుగు వందల ఫ్లాట్లను విక్రయించగలిగాం. మియాపూర్ మెయిన్ రోడ్డు మీద షాపింగ్ మాల్ కమ్ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నాం. ప్రస్తుతం ఇంటీరియర్స్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి కల్లా మల్టీప్లెక్స్ సిద్ధమవుతుంది.
– ఎస్ రాంరెడ్డి, సీఎండీ, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్
2022లో మొదటి ఆరు నెలలు మార్కెట్ కొద్దిగా మందగమనంలో ఉంది. ఐటీ నిపుణులు ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం.. ప్రీలాంచుల్లో కొనడం.. వంటివి జరిగేవి. కాకపోతే, జూన్ తర్వాత ఆఫీసులు తెరుచుకోవడం ఆరంభమైంది. ప్రీలాంచుల వల్ల జరిగే నష్టాలు అర్థం కావడంతో.. కొనుగోలుదారులు అనుమతితో అపార్టుమెంట్లను కట్టేవారి వద్ద కొనడం ఆరంభించారు. ఫలితంగా, మార్కెట్ మళ్లీ కొంత గాడిలో పడింది. హైదరాబాద్ గొప్పతనం ఏమిటంటే.. కొత్త కంపెనీలు ఇక్కడికి వస్తూనే ఉన్నాయి. ఫలితంగా, కొత్తగా ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. మరోవైపు మెరుగైన రోడ్ల నెట్‌వర్క్, పటిష్ఠమైన రవాణా వ్యవస్థ కారణంగా.. సంగారెడ్డి వంటి ప్రాంతాల్నుంచి నగరానికొచ్చి ఉద్యోగాలు చేసేవారి సంఖ్య అధికమైంది. గృహరుణాలపై వడ్డీ రేట్లు పెరగడం వల్ల కొనుగోలుదారుల్లో కొంత వేచి చూసే ధోరణీ అలవడింది. మూడు, నాలుగు నెలల తర్వాత మళ్లీ కొనుగోలు చేస్తారు.
– ప్రేమ్ కుమార్, అధ్యక్షుడు, నరెడ్కో వెస్ట్ జోన్
భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు, నగరాలతో పోల్చితే పెద్దగా ఇబ్బంది పడలేదు. కాకపోతే అమ్మకాలు కొంత తగ్గాయి. కొన్ని మీడియాల్లో రియల్ రంగంపై వచ్చిన ప్రతికూల కథనాలే ప్రధాన కారణం. అయితే, బిల్డర్లు కానీ వారూ ప్రీలాంచ్, యూడీఎస్ అంటూ.. తక్కువ రేటుకే ఫ్లాట్లు అంటూ మార్కెట్ ని కొంత డైవర్ట్ చేశారు. రేటు తక్కువకు ఇచ్చే బిల్డర్ నిజంగా అపార్టుమెంట్ కట్టగలడా? లేదా? అనే అంశాన్ని ఆలోచించకుండా.. కనీస పరిజ్ఞానం లేకుండా.. ఉన్నత విద్యావంతులు సైతం ప్రీలాంచుల్లో కొని మోసపోయారు. మరి, వారు తప్పు చేసి.. ప్రభుత్వాన్ని నిందించడం కరెక్టు కానే కాదు. నేటికీ కొనుగోలదారుల నుంచి పది ఎంక్వయిరీలు వస్తే.. గతంలో ఆరు వరకూ అమ్మకాలు జరిగేవి. ప్రస్తుతం రెండు, మూడు జరుగుతున్నాయి.
This website uses cookies.