(కింగ్ జాన్సన్ కొయ్యడ)
ప్రపంచంలో కాలుష్యరహితమైనటువంటి, ట్రాఫిక రద్దీని నివారించేనటువంటి ఏకైక మార్గం.. మెట్రో మాస్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం హైదాబాద్‌లో ఇంకా విస్తరించాల్సిన అవసరముంది.. బీహెచ్ఈఎల్ నుంచి రాయదుర్గం మెట్రోకు కలిసేలా అభివృద్ధి చేస్తాం.. హైదరాబాద్ చుట్టూ, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో కూడా మెట్రో రైలు రావాల్సిన అవసరముంది.. కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నా.. లేకున్నా.. రాబోయే రోజుల్లో ఆ సౌకర్యాల్ని కలిగించుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
శుక్రవారం టీఎస్‌పీఏ జంక్షన్ వద్ద మెట్రో పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో అనేక విజయాలను సాధించాల్సిన అవసరముంది. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా.. ప్రపంచమే అబ్బురపడేలా హైదరాబాద్‌ను పచ్చదనంతో కళకళలాడేలా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్‌లో బతకడానికి వచ్చేవారు, బతుకు బాగుందని తెలిసి వచ్చేవారికి అవసరమయ్యే మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న గేటెడ్ కమ్యూనిటీలు, ఆఫీసు స్పేస్‌లు, పద్ద పెద్ద విల్లాలు, ఆకాశహర్మ్యాలను దృష్టిలో పెట్టుకుని.. మౌలిక సదుపాయాల్ని పెంచడానికి.. ప్రత్యేకంగా ఆర్ అండ్ డీ చేయాల్సిన అవసరముందని వివరించారు. ఇందుకు అవసరమయ్యే నిధుల్ని సమకూరుస్తామని తెలిపారు. ఇంకా ఏమన్నారో.. సారాంశం ఆయన మాటల్లోనే..
‘‘ హైదరాబాద్ మెట్రో రైలును మైండ్ స్పేస్ నుంచి ఎయిర్ పోర్టు వరకూ.. రాష్ట్ర ప్రభుత్వం, జీఎమ్మార్, హెచ్ఎండీఏ నిధులతో ఏర్పాటు చేస్తున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ నగరంలో చరిత్రలో సుప్రసిద్ధమైన నగరం. ఒక సందర్భంలో.. దేశ రాజధాని ఢిల్లీ కంటే వైశాల్యంలో, జనాభాలో చాలా పెద్దదిగా ఉన్న నగరం. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. దేశంలోనే అనేక ఇతర నగరాల కంటే.. మన హైదరాబాద్ కి కరెంటు 1912లోనే వచ్చింది. అదే చెన్నై, అప్పటి మద్రాసు నగరానికి 1927లో కరెంటు రావడం జరిగింది. చరిత్రలో నిజమైనటువంటి కాస్మోపాలిటన్ సిటీగా .. అన్ని వర్గాలను, కులాలను, మతాలను, ప్రాంతాలను, జాతులను అక్కున చేర్చుకుని ఒక అద్భుతమైనటువంటి విశ్వనగరంగా ఉన్నటువంటి హైదరాబాద్ ఈరోజు మెట్రో రైలును ఏర్పాటు చేసుకుంటోంది.
24 గంటలూ ఒక క్షణం పాటు కరెంటు పోకుండా పరిస్థితిని ఏర్పాటు చేసుకున్నం. నేనే పట్టుబట్టి హైదరాబాద్‌ను పవర్ ఐల్యాండ్‌గా మార్చినా. అంటే, రాష్ట్రంలో ఉన్న అన్ని జెనరేటింగ్ స్టేషన్లతోను, స్టేట్ ఎలక్ట్రిసిటీ గ్రీడ్‌తో.. నేషనల్ ఎలక్ట్రిసిటీ గ్రీడ్‌తో హైదరాబాద్ నగరం పవర్ సెక్టార్‌లో అనుసంధానం అయిపోయింది. అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే.. న్యూయార్క్, లండన్, పారిస్‌లో కరెంటు పోతుందేమో కానీ హైదరాబాద్‌లో మాత్రం కరెంటు పోదు పోదు అని మనవి చేస్తున్నా.
ఇటువంటి అద్భుత నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుకున్నం కాబట్టి ఐటీకి చెందిన 500 పరిశ్రమలు ఇక్కడ కొలువుదీరాయి. పరిశ్రమ రంగాన్ని ముందుకు తీసుకెళుతున్నాం. ఎస్సార్డీపీ, ఫ్లయ్ ఓవర్లు, అండర్ పాసులతో ట్రాఫిక్ కష్టాలు తీర్చుకుంటున్నాం. ఆఫీసు స్పేస్‌లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ నిబంధనల్ని సడలించి వెసులుబాటు కల్పించాం. దీంతో, నలభై, అరవై అంతస్తుల ఆకాశహర్మ్యాలకు అనుమతుల్ని మంజూరు చేస్తున్నాం.
ఎయిర్ పోర్టులో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. దీంతో రెండో రన్‌వే కూడా వస్తా ఉంది. 6.250 కోట్లతో బ్రహ్మాండంగా ఈ రోజు మెట్రో రైలు కనెక్టివిటీని ఏర్పాటు చేసుకుంటున్నం. 31 కిలోమీటర్లలో.. 27 కిలోమీటర్లు ఎలివేటెడ్ మార్గంలో.. రెండున్నర కిలోమీటర్లు భూగర్భంలో.. సుమారు ఒక కిలోమీటర్ రోడ్డు పైమార్గంలో మెట్రో రైలు ప్రయాణం కొనసాగుతుంది. సత్వరమే దీన్ని పూర్తి చేసుకుంటాం. కరోనా వల్ల కొంత వెసులుబాటు తగ్గినప్పటికీ.. మన మెట్రోలో ప్రతిరోజు నాలుగున్నర లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఎయిర్‌పోర్టు మెట్రో వల్ల మరో 70, 80 వేల మంది అదనంగా ప్రయాణిస్తారు. ఇది వస్తే మంచి వెసులుబాటు కలుగుతుంది. వరల్డ్ బెస్ట్ గ్రీన్ సిటీ అవార్డు హైదరాబాద్‌కు వచ్చినందుకు చీఫ్ సెక్రటరిని, జీహెచ్ఎంసీ కమిషనర్, హెచ్ఎండీఏలను అభినందిస్తున్నాను.’’
This website uses cookies.