ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న స్థల యజమాని అవాక్కయ్యే ఘటన చోటు చేసుకుంది. ఎల్ఆర్ఎస్ ఫీజు ఏకంగా 27 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ లేఖ రావడంతో కంగుతిన్నారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో బుధవారం చోటుచేసుకుంది. జడ్చర్ల మున్సిపాలిటీలోని సర్వే నంబరు 108 లో కిష్టారెడ్డినగర్ కు చెందిన 337 గజాల ఇంటి స్థలం రెగ్యులరైజ్ చేసుకోవడానికి పద్మ అనే మహిళ 2020 అక్టోబరు 15న దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు దరఖాస్తుదారులకు మున్సిపల్ అధికారుల నుంచి లేఖ అందింది. అందులో 27,33,42,786 రూపాయలు రెగ్యులరైజ్ ఛార్జీలు చెల్లించాలని ఉండటంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఐతే సాంకేతిక కారణాలతో పొరపాటు జరిగి ఉంటుందని జడ్చర్ల మున్సిపల్ కమీషనర్ లక్ష్మారెడ్డి తెలిపారు. దాన్ని సరి చేసి మళ్లీ ఎల్ఆర్ఎస్ ఛార్జీకి సంబంధించిన లేఖ పంపిస్తామని చెప్పారు.