ఓ వైపు ఔటర్ రింగ్ రోడ్డు.. మరో వైపు టీసీఎస్ లాంటి కంపెనీలు.. సమీపంలోనే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్.. ఓ ప్రాంతం అభివృద్ది చెందడానికి.. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. వీటికి తోడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా రావడంతో ఆదిభట్ల రూపురేఖలే మారిపోతున్నాయి. అవును.. ఇప్పటికే నివాసాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఆదిభట్ల, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఇక్కడ ఓపెన్ ప్లాట్ లేఅవుట్లతో పాటు భారీగా అపార్ట్ మెంట్లు, విల్లాల నిర్మాణం జరుగుతోంది. అందరికీ అందుబాటు ధరల్లో ఇళ్లు, ఇంటి స్థలాలు లభిస్తుండటంతో మధ్యతరగతి వారి చూపు ఆదిభట్ల వైపు మళ్లింది.
ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న ఆదిభట్ల పరిసరాల్లో రియాల్టీ క్రమంగా పుంజుకుంటోంది. ఆదిభట్ల ఓఆర్ఆర్ నుంచి రంగారెడ్డి కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో ఖాళీ స్థలాలపై స్థిరాస్తి వ్యాపారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల వెంచర్లు ఏర్పాటు చేశారు. గతంలో 20 నుంచి 25 వేలుగా ఉన్న గజం విలువ.. ఇప్పుడు 20 నుంచి 30 శాతం పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. డబుల్ బెడ్ రూం ఫ్లాట్ 60 లక్షల రూపాయల నుంచి దొరుకుతోంది. ఇండిపెండెంట్ హౌజ్ 80 లక్షలు, విల్లా అయితే కోటి 50 లక్షల నుంచి లభిస్తున్నాయి.