మారుతున్న కాలంతోపాటే ఇళ్ల కొనుగోలుదారుల అభిరుచులు, ఆకాంక్షల్లో కూడా గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 50 శాతం మంది మిలీనియల్స్ (28 ఏళ్ల నుంచి 43 ఏళ్ల మధ్య వయసున్నవారు) 3 బీహెచ్ కే ఇళ్లనే ఇష్టపడుతుండగా.. జెన్ ఎక్స్ (44 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్నవారు)లో 75 శాతం మంది బాల్కనీలు కావాలనుకుంటున్నారు. అలాగే 58 శాతం మంది మిలీనియల్స్, 39 శాతం మంది జెన్ ఎక్స్ కొనుగోలుదారులు ఇంటి కొనుగోలు కోసం ఇతర పెట్టుబడుల నుంచి వచ్చే లాభాలను వినియోగించాలని భావిస్తున్నారు. ఈ విషయాలు ఫిక్కీ-అనరాక్ సంయుక్తంగా చేపట్టిన సర్వేలో వెల్లడయ్యాయి.
గతేడాది జూలై నుంచి డిసెంబర్ మధ్య దేశంలోని వివిధ నగరాలకు చెందిన దాదాపు 5,510 మందితో ఆన్ లైన్ లో ఈ సర్వే నిర్వహించారు. 38 శాతం మంది కొనుగోలుదారులు 2 బీహెచ్ కే వైపు మొగ్గు చూపించినట్లు ఇందులో తేలింది. ప్రాపర్టీ ధరలు పెరుగుతున్నప్పటికీ, పెద్ద అపార్ట్ మెంట్లకు కూడా డిమాండ్ నిరంతరంగా కొనసాగుతోంది. పైగా వీటి కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీల్లో 3 బీహెచ్ కేలకు ఎక్కువ ఆదరణ ఉంటోంది. ముంబైలో 2 బీహెచ్ కే ఇళ్లకు 44 శాతం మంది ఓటేశారు. అలాగే సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లకు ముంబైలో 17 శాతం మంది మొగ్గు చూపించగా..
పుణెలో 10 శాతం మంది వాటిని కావాలనుకుంటున్నారు. మరోవైపు రూ.కోటిన్నర కంటే ఎక్కవ ధర కలిగిన లగ్జరీ ఇళ్లకు కూడా డిమాండ్ పెరిగింది. దాదాపు 20 శాతం మంది ఇంత ధర పెట్టి ఇల్లు కొనడానికి ఆసక్తి కనబరిచారు. ఇది 2021 ద్వితీయార్థంలో 12 శాతం మాత్రమే ఉంది. ఇక రూ.45 లక్షల నుంచి రూ90 లక్షల బడ్జెట్ లో ఇళ్లకు అత్యధికంగా 33 శాతం మంది మొగ్గు చూపించారు. కాగా, అందుబాటు ధరల ఇళ్లకు డిమాండ్ తగ్గుతోంది. వీటి అమ్మకాలు 2020 ద్వితీయార్థంలో 40 శాతం ఉండగా.. 2021 ద్వితీయార్ధంలో 25 శాతానికి, 2023 ద్వితీయార్థంలో 21 శాతానికి తగ్గుతూ వచ్చాయి. గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సగటున ఫ్లాట్ సైజులు 11 శాతం వృద్ధి చెందాయి.
This website uses cookies.