ఎవరైనా ఇల్లు కొనేముందు చూసే ముఖ్యమైన అంశాల్లో కనెక్టివిటీ ఒకటి. ఇంటి నుంచి ఆఫీసు లేదా ఆస్పత్రి, స్కూళ్లు, కాలేజీలు ఎంత దూరంలో ఉన్నాయనే విషయంతోపాటు అక్కడకు వెళ్లడానికి మెరుగైన కనెక్టివిటీ ఉందా లేదా అనేది తప్పకుండా చూసుకుంటారు. రోడ్డు కనెక్టివిటీ ఎలా ఉంది? మెట్రో అందుబాటులో ఉందా అని పరిశీలించుకుని ముందడుగు వేస్తారు. ఈ నేపథ్యంలోనే పెద్ద పెద్ద నగరాల్లో మెట్రోకు డిమాండ్ ఉంటోంది. అలాగే మెట్రో రైలు ప్రభావం రియల్ రంగంపై చాలా ఎక్కువగానే ఉంటోంది. ఆయా నగరాల్లో ప్రాపర్టీ ధరలు లొకేషన్, భూ వినియోగాన్ని బట్టి ప్రభావం చూపుతున్నాయి. తాజాగా కోల్ కతాలో అండర్ గ్రౌండ్ మెట్రో రైలును ప్రారంభించారు.
అలాగే ఆగ్రా, పుణె, కొచ్చి, ఢిల్లీ-మీరట్ కారిడార్ లో బహుళ మెట్రో ప్రాజెక్టులను ఆయన ఆవిష్కరించారు. ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పట్టణీకరణ వేగవంతం కావడానికి సహకరిస్తాయని, అదే సమయంలో మెట్రో నగరాల్లో రద్దీని తగ్గించడానికి ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే లొకేషన్, భూ వినియోగం, మైక్రో మార్కెట్ మొత్తం సామర్థ్యాన్ని బట్టి ఈ ప్రాంతాల్లోని ప్రాపర్టీల ధరలపై కూడా ఇవి ప్రభావం చూపుతాయని అంటున్నారు.
అధికంగా వృద్ధి చెందుతున్న నగరాల్లో ఏకకాలంలో రద్దీని తగ్గించడానికి, కొత్త ట్రాన్సిట్ కారిడార్లలో నివాస, వాణిజ్య, పారిశ్రామిక వృద్ధి సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఇవి చక్కగా దోహదం చేస్తాయని స్పష్టంచేస్తున్నారు. మెట్రో కనెక్టివిటీ రావడం వల్ల స్థలం ఉన్న ప్రాంతం, భూ వినియోగం, మైక్రో మార్కెట్ వంటటి అంశాలపై ఆధారపడి ఆస్తి ధర 50 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త మెట్రో లైన్ల ప్రారంభం రియల్ ఎస్టేట్ మార్కెట్లపై ప్రభావం చూపుతుందని, వాటి ప్రభావం జోన్ లోపల, వెలుపల కూడా ఉంటుందని పేర్కొంటున్నారు. ‘ఓ ప్రాంతంలోకి మెట్రో కనెక్టివిటీ వస్తే..
ఆ ప్రాంతంపై నివాస, వాణిజ్య డెవలపర్లతోపాటు పెట్టుబడిదారులు ఆకర్షితులవుతారు. దీంతో అక్కడి స్థలాలు, ప్రాపర్టీలకు డిమాండ్ పెరుగుతుంది. దీంతో ఆస్తి విలువలు పెరుగుతాయి. ఇప్పటికే అక్కడున్న ప్రాపర్టీ యజమానులకు గణనీయమైన లాభం కలుగుతుంది’ అని అనరాక్ గ్రూప్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ పేర్కొన్నారు.
మెట్రో ప్రాజెక్టుల వల్ల పట్టణీకరణ వేగవంతంగా సాగడంతోపాటు నగరాల్లో రద్దీ తగ్గుతుందని.. పర్యావరణ అనుకూలమైన మౌలిక సదుపాయాలు ఆయా నగరాల్లో అందుబాటు ధరల గృహాల ప్రాజెక్టుల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం ఇస్తాయని కొలియర్స్ ఇండియా రెసిడెన్షియల్ ట్రాన్సాక్షన్ సర్వీసెస్ ఎండీ రవిశంకర్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ మెట్రో ప్రాజెక్టుల వల్ల ప్రజలు తమ ఆఫీసుల నుంచి దూరంగా తమకు అనుకూలమైన ప్రదేశంలో నివసించడానికి మొగ్గు చూపుతారని చెప్పారు. ఇది నగరాల విస్తరణకు ఇలా దోహదరం చేస్తుందన్నారు.
This website uses cookies.