Categories: TOP STORIES

3 లక్షల ఇళ్లు.. రూ.4.26 లక్షల కోట్లు

2024 మొదటి తొమ్మిది నెలల్లో ఇళ్ల అమ్మకాల తీరిదీ

గతేడాదితో పోలిస్తే 5 శాతం తగ్గుదల

దేశంలో ఇళ్ల అమ్మకాలు కాస్త తగ్గాయ్. దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తొమ్మిది నెలల్లో రూ.4.26 లక్షల కోట్ల విలువైన 3 లక్షల ఇళ్లు అమ్ముడయ్యాయి. రియల్ ఎస్టేట్ అనలిటిక్స్ ప్లాట్ ఫాం సీఆర్ఈ మ్యాట్రిక్స్ ఈ మేరకు వివరాలను విడుదల చేసింది. ఒక్క సెప్టెంబర్ త్రైమాసికాన్ని తీసుకుంటే ముంబై, థానే, ఢిల్లీ, పుణె, హైదరాబాద్, కోల్ కతా, బెంగళూరుల్లో రూ.1.38 లక్షల కోట్ల విలువైన 92,208 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అదే సమయంలో మూడు నెలల కాలంలో 73,974 కొత్త యూనిట్లు ప్రారంభమయ్యాయి.

మొత్తంమీద 2024 మూడో త్రైమాసికంలో అమ్ముడైన గృహాల సంఖ్య వార్షిక ప్రాతిపదికన 5% తగ్గింది. అయితే, మూడు నెలల కాలంలో అమ్ముడైన గృహాల విలువ 23% పెరిగింది. సెప్టెంబర్ త్రైమాసికంలో విక్రయించిన రూ.41,219 కోట్ల విలువైన ఇళ్లతో ఢిల్లీ అగ్రగామిగా ఉంది. అయితే పూణే అత్యధికంగా 18,749 యూనిట్లను విక్రయించి, మొత్తం విక్రయాలలో 20% వాటాను పొందింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు తొమ్మిది నెలల్లో ఢిల్లీ-ఎన్ సీఆర్ మొత్తం రూజ1.2 లక్షల కోట్ల విలువైన ఇళ్లను విక్రయించింది.

ఇక భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై 2024 మూడవ త్రైమాసికంలో 12,101 గృహాలను విక్రయించింది. వీటి విలువ రూ.26,824. బెంగళూరులో, జూలై-సెప్టెంబర్ కాలంలో నమోదైన యూనిట్ల సంఖ్య ఏడాది ప్రాతిపదికన 15% క్షీణించి 13,589కి చేరుకుంది, అయితే ఈ త్రైమాసికంలో విక్రయించిన ఇళ్ల విలువ సుమారు 7% తగ్గి రూ.18,005 కోట్లకు చేరుకుంది. మరోవైపు హైదరాబాద్ సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.26,633 కోట్ల విలువైన మొత్తం 15,620 యూనిట్లను విక్రయించింది. మొత్తం అమ్మకాలలో 17 శాతంతో రెండో స్థానంలో నిలిచింది.

పుణెలో సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 13 శాతం క్షీణించి 18,749కి చేరుకున్నాయి. అలాగే యూనిట్ల విలువ 8% తగ్గి ₹13,788 కోట్లకు చేరుకుంది.

This website uses cookies.