నిపుణులు కొన్నేళ్ల పాటు చేసిన అధ్యయనాల ఆధారంగా.. గత ప్రభుత్వాలు 111 జీవోను అమల్లోకి తెచ్చాయి. ఇప్పుడేమో ఎలాంటి అధ్యయనం లేకుండా.. పురపాలక శాఖ ఈ జీవోను ఎత్తివేసి.. ఆ ప్రాంతంలో నిర్మాణాలకు అనుమతినిస్తామని చెబుతోంది. మరి, ఇందుకోసం ప్రభుత్వం శాస్త్రీయంగా అధ్యయనం చేసిందా? అలా చేస్తే.. ఆ నిపుణుల నివేదికను పురపాలక శాఖ ఎందుకు బహిర్గతపర్చడం లేదు? అమాత్యులకే తెలియాలి. కరెంటుపై ఆధారపడ్డ కృష్ణా, గోదావరి నీళ్లను చూసి.. నామమాత్రపు ఖర్చుతో సరఫరా అయ్యే గండిపేట్ నీళ్లు అవసరం లేదని సీఎం కేసీఆర్ అనడం ఎంతవరకూ సమంజసం అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతెందుకు సుప్రీం కోర్టు 111 జీవోకు సంబంధించి తుది తీర్పునిచ్చే ముందు.. పలు నిపుణుల రిపోర్టులను తెప్పించుకుని అధ్యయనం చేసింది. కానీ, ఇప్పుడేమో అలాంటి శాస్త్రీయ అధ్యయనమే జరగలేదని నిపుణులు అంటున్నారు.
ట్రిపుల్ జీవో 111 ప్రాంతంలో.. సుమారు 90 శాతం భూముల్ని రైతులు ఇప్పటికే విక్రయించారని.. ప్రస్తుతం పది శాతం మంది స్థానికుల చేతిలో మాత్రమే స్థలాలున్నాయని తెలుస్తోంది. అందుకే, 111 జీవోను తొలగించడం వల్ల కేవలం పెట్టుబడిదారులకే ప్రత్యక్ష ప్రయోజనం జరుగుతుంది తప్ప.. స్థానిక ప్రజానీకానికి కాదని సమాచారం. కేవలం ఓటు రాజకీయాల కోసం.. తెలంగాణ రాష్ట్రానికే గుండెకాయ వంటి హైదరాబాద్‌ను ధ్వంసం చేయడం సరైన నిర్ణయం కాదని నిపుణులు మొత్తుకుంటున్నారు. ఏదో కొంతమందికి ప్రయోజనం కలిగేందుకై.. భాగ్యనగరాన్ని ప్రమాదంలోకి నెట్టివేయడం సమంజసం కాదని అంటున్నారు. ఇక్కడి రైతులకు ఆర్థికంగా ప్రయోజనం కలగాలంటే.. వినూత్నంగా ఆలోచించి సరికొత్త పథకాలకు శ్రీకారం చుట్టాలని చెబుతున్నారు. అంతేతప్ప, భాగ్యనగరం మరో బెంగళూరు లేదా ముంబై కాకూదని అంటున్నారు. చిన్న వర్షం పడితే చాలు.. రహదారులన్నీ గోదావరిగా మారుతున్న ప్రస్తుత తరుణంలో.. 66 వేల ఎకరాల్లో ఇళ్ల నిర్మాణాల్ని అనుమతినిస్తే.. భవిష్యత్తులో పరిస్థితి మరింత దిగజారుతుందని భయపడుతున్నారు. వర్షం పడిన ప్రతిసారి ముంబైలో నేటికీ కొన్ని ప్రాంతాలు నీటమునిగిపోతున్న విషయం తెలిసిందే. ఒకవేళ ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో నిర్మాణాలకు అనుమతిని మంజూరు చేసినా.. అదే పరిస్థితి తలెత్తుతుందని ప్రజలు భావిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఖుషీ
111 జీవో ప్రాంతాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దుతారనే వార్త రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు సరికొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. దీంతో, వీరంతా ఊర్ల మీద పడిపోయి.. అక్కడక్కడ ఉన్న రైతులతో కూడా మాట్లాడి.. ఎకరానికి ఒకట్రెండు కోట్లు పెంచేసి.. మిగిలిన భూములను కూడా అమ్మే ప్రయత్నాన్ని ఆరంభించారు. అంతేకాదు, ఇప్పటికే ఆయా ప్రాంతంలో భూముల్ని కొన్నవారూ రేటు పెంచేస్తున్నారని తెలిసింది. కాకపోతే, హరితనగరం అభివృద్ది చేయడానికి ఏడాదిన్నర పడుతుందని సమాచారం. మరి, అప్పటికీ ఎన్నికలొచ్చి.. అధికారంలో ఎవరుంటారో ప్రజలే నిర్ణయిస్తారు.