- నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు
సునీల్ చంద్రారెడ్డి
హైదరాబాద్‌లో గత వారం నిర్వహించిన మూడు రోజుల ప్రాపర్టీ షోకు అపూర్వమైన స్పందన లభించిందని నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు సునీల్ చంద్రారెడ్డి తెలిపారు. 12వ ఎడిషన్ ప్రాపర్టీ షో ముగింపు రోజు ఆయన రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ప్రాపర్టీ షోకు విచ్చేసిన వారిలో కొందరు సైట్ విజిట్‌లు కూడా చేశారని.. బిల్డర్లకు అడ్వాన్సులు కూడా చెల్లించారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ప్రాస్పెక్టీవ్ బయ్యర్లు తమకు నచ్చిన ప్రాజెక్టులను కొనుగోలు చేశారని చెప్పారు.
దాదాపు వంద మంది బిల్డర్లు పాల్గొన్న ఈ ప్రాపర్టీ షోలో ఎంతలేదన్నా ఐదు వందల ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారాన్ని కొనుగోలుదారుల ముందు ఉంచారని.. ఇందులో లేఅవుట్లు, అపార్టుమెంట్లు, విల్లాలు, వాణిజ్య సముదాయాలు వంటివి ఉన్నాయని చెప్పారు. దాదాపు పది బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అక్కడికక్కడే ఇళ్ల కొనుగోలుదారుల రుణ అర్హతను వివరించారని తెలిపారు. దీంతో, ప్రదర్శనకు విచ్చేసిన వారి సొంతింటి ఎంపిక మరింత సులువైందని అన్నారు. మొత్తానికి ప్రదర్శనలో పాల్గొన్న బిల్డర్లు, రియల్టర్లు, మెటీరియల్ సప్లయర్స్, బ్యాంకర్లు, ఆర్థిక సంస్థలు నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో పాల్గొన్నందుకు ఆనందం వ్యక్తం చేశారు.