అమ్మకాల విలువ 20 శాతం పెరుగుదల
హైదరాబాద్ పై స్క్వేర్ యార్డ్స్ నివేదిక
రెండు మూడు నెలలుగా కాస్త ఒడుదొడుకులకు లోనైన హైదరాబాద్ రియల్ రంగంలో కాస్త ఊరట కలిగించే అంశం వెలుగులోకి వచ్చింది. జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో హైదరాబాద్ లో హౌసింగ్ లావాదేవీలు 7 శాతం మేర పెరిగాయని, అమ్మకాల విలువలో 20 శాతం వృద్ధి ఉందని స్క్వేర్ యార్డ్స్ తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది ఇదే కాలంలో హైదరాబాద్‌లో 18,314 లావాదేవీలు జరగ్గా, ఈ ఏడాది 19,527 లావాదేవీలు నమోదయ్యాయని తెలిపింది. అదే సమయంలో మొత్తం అమ్మకాల విలువ 20 శాతం వృద్ధితో రూ.11,718 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది.
ఇక ఈ త్రైమాసికంలో 13% వార్షిక వృద్ధిని ప్రతిబింబిస్తూ హైదరాబాద్‌లో నమోదైన గృహాల విక్రయాల సగటు విలువ రూ.60 లక్షలకు చేరుకుందని నివేదిక పేర్కొంది. సెప్టెంబరు 2024 త్రైమాసికంలో రూ. కోటి, అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తుల వాటా 13%కి పెరగడంతో హైదరాబాద్ మధ్యస్థ నుంచి అధిక ధరల విభాగంలో వృద్ధిని కొనసాగిస్తోంది. గతేడాది ఇదే కాలంలో ఇది 9 శాతంగా ఉంది. రూ. కోటి–రూ. 2 కోట్ల మధ్య ధర కలిగిన గృహాలు 11% వద్ద అత్యధిక వాటాను కలిగి ఉన్నాయి. గతేడాది జూలై-సెప్టెంబర్ కాలంలో ఇది 7 శాతంగా ఉంది.
హైదరాబాదీలు పెద్ద ఇళ్ల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నట్టు నివేదిక తెలిపింది. వెయ్యి నుంచి 1500 చదరపు అడుగుల ఇళ్ల అమ్మకాలు 44 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. 1500 నుంచి 3వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన యూనిట్ల అమ్మకాలు 37 శాతంతో రెండో స్థానంలో నిలిచాయి. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాలతోపాటు కోకాపేట్, నార్సింగి, ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న ప్రాంతాలు విమానాశ్రయం, హైదరాబాద్ ఐటీ హబ్‌లకు అద్భుతమైన కనెక్టివిటీ కారణంగా అధిక నివాస కార్యకలాపాలు కలిగి ఉన్నాయని స్క్వేర్ యార్డ్స్ ప్రిన్సిపల్ పార్ట్ నర్, సేల్స్ డైరెక్టర్ దేబయన్ భట్టాచార్య అన్నారు. రాబోయే నెలల్లో హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ మరింత వృద్ధి పథంలో పయనిస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు.