గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) వివిధ రోడ్డు ప్రాజెక్టుల కోసం సేకరించిన 350 ఎకరాల భూమికి నగదు చెల్లింపునకు బదులుగా 864 అభివృద్ధి హక్కుల బదిలీ(టీడీఆర్) సర్టిఫికెట్లను జారీచేసింది. భూమి యజమానులు సైతం టీడీఆర్ లు తీసుకోవడానికే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ‘నష్టపరిహారం విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో టీడీఆర్ విధానానని జీహెచ్ఎంసీ తీసుకొచ్చింది. తద్వారా చాలా తక్కువ మొత్తంతోనే ప్రాపర్టీలను సేకరించే అవకాశం ఉంది. దానివల్ల ఖజానాపై పెద్దగా భారం పడదు. పైగా ప్రాపర్టీ యజమానులు సైతం తమ భూమికి నగదు పరిహారం తీసుకోవడం కంటే టీడీఆర్ సర్టిఫికెట్లు తీసుకోవడానికే ఆసక్తి కనబరుస్తున్నారు.
దీంతో టీడీఆర్ సర్టిఫికెట్ల వినయోగం గణనీయంగా పెరుగుతోంది’ అని జీహెచ్ఎంసీ ఓ ప్రకటనలో తెలిపింది. గత ఐదేళ్లలో 89 రోడ్డు ప్రాజెక్టులు చేపట్టగా.. వాటిలో 55 రోడ్లు నిర్మించడం కోసం 1805 ప్రాపర్టీలు సేకరించినట్టు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. ఇక ఎస్ఆర్ డీపీ కేటగిరీలో 1100 ప్రాపర్టీలు, మిస్సింగ్, స్లిప్ రోడ్ల కోసం 192 ప్రాపర్టీలు, సాధారణ రోడ్ల వెడల్పు కోసం 511 ప్రాపర్టీలు సేకరించినట్టు వివరించారు. అలాగే బయో డైవర్సిటీ ఫ్లైఓవర్, శిల్పారామం ఆర్ యూబీ, జేఎన్టీయూ వద్ద రాజీవ్ గాంధీ ఫ్లైఓవర్, రోడ్ నెంబర్ 45, దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, హైటెక్ సిటీ వద్ద ఆర్ యూబీ, బైరామల్ గూడ నుంచి చింతల్ కుంట చెక్ పోస్టుకు అండర్ పాస్, వివిధ ప్రాంతాల్లో ఫైఓవర్ల కోసం భూ సేకరణ జరిపి రోడ్ల విస్తరణ పనులు పూర్తిచేసినట్టు చెప్పారు.