* రియల్ ఎస్టేట్ గురు ఎఫెక్ట్
రెరా నిబంధనలు పాటించని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై చర్యలు తప్పవని తెలంగాణ రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) చైర్మన్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ తెలిపారు. రెరా నిబంధనలు ఉల్లంఘించిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు రెరా చైర్మన్ ఆదేశాల మేరకు.. రెరా మెంబర్ సెక్రెటరి బాలకృష్ణ బుధవారం ఐదు ప్రాజెక్టులకు నోటీసుల్ని జారీ చేశారు. ఈ సంస్థలు పదిహేను రోజుల్లోపు రెరాకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే, ఈ సంస్థలపై రెరా తగు చర్యల్ని తీసుకుంటుంది. మరి, ఏయే సంస్థలకు రెరా షోకాజ్ నోటీసును జారీ చేసిందంటే..
* రాధే గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థ ఎలాంటి “రెరా” రిజిస్ట్రేషన్ లేకుండా.. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలోని ఉస్మాన్ నగర్ లో రాధే పనోరమా అనే ప్రాజెక్టును ప్రీ లాంచింగ్ పేరుతో అమ్మకానికి పెట్టినట్లు “రెరా” దృష్టికొచ్చింది. రెరా నిబంధనలు ఉల్లంఘించినందుకు టీఎస్ రెరా అథారిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది.
* ఓం శ్రీ బిల్డర్లు డెవలపర్స్.. ఓం శ్రీ సిగ్నెట్ పేరుతో ప్రాజెక్టును ఆరంభించి.. రెరా నుంచి.. ఏ,బి,సి,డి బ్లాక్ లకు మాత్రమే రిజిస్ట్రేషన్ అనుమతి పొంది, ఎలాంటి అనుమతి లేకుండా “E” బ్లాక్ నిర్మాణం చేపట్టింది.
* భువన తేజ ఇన్ఫ్రా ప్రాజెక్టు యాజమాన్యం తక్కువ రేట్లకే ప్లాట్లు అంటూ ఫ్రీలాంచ్ విక్రయాలు హైదరాబాదులోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర నగరాల్లో ప్రిలాంచుల్ని చేపట్టింది.
* టీఎంఆర్ నిర్మాణ సంస్థ రెరా రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ.. నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రదర్శించకుండా.. ప్రచారం నిర్వహించింది.
* సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ లేక్ వ్యూ పేరుతో “రెరా” రిజిస్ట్రేషన్ లేకుండా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సమీపంలోని ఎల్లాపూర్ లో ప్లాట్లు విక్రయించింది.
మొత్తానికి, ఐదు సంస్థలపై రెరా షోకాజ్ నోటీసుల్ని జారీ చేయడం పట్ల నిర్మాణ రంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రీలాంచుల్ని పూర్తిగా నిరోధించినప్పుడే హైదరాబాద్ రియల్ మార్కెట్ అభివృద్ధి చెందుతుందని నిపుణులు అంటున్నారు.