- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- నగరంలో నరెడ్కో సిల్వర్ జూబ్లీ వేడుకలు
హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ అని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. నరెడ్కో రజతోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ‘హైదరాబాద్ లో ఎయిర్ వేస్, హైవేస్, రైల్వేస్ తోపాటు జాతీయ, అంతర్జాతీయ రవాణా సౌకర్యాలు, నగరమంతా ఔటర్ రింగు రోడ్డుతో అనుసంధానం, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి ఎన్నో వినోద కేంద్రాలు, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగం.. వెరసి హైదరాబాద్ హ్యాపెనింగ్ సిటీ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు’ అని పేర్కొన్నారు.
నేచర్, కల్చర్ టుగెదర్ ఫర్ బెటర్ ఫ్యూచర్..
‘ప్రకృతి, సంస్కృతిల చక్కని మేళవింపు మంచి భవిష్యత్తుకు నాంది అవుతుంది. పూర్వం మనమంతా ప్రకృతితో మమేకమై జీవించేవాళ్లం. కానీ ఇప్పుడు ప్రకృతితో మనం ఆడుకుంటుంటే, మనతో ప్రకృతి ఆడుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రకృతి విపత్తులు, అకాల వర్షాలు, విపరీతమైన వేడి.. ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రకృతిని రక్షించే చర్యలపై మనం దృష్టి పెట్టకపోవడమే ఇందుకు కారణం. ఆక్రమణలు అనేవి ఇప్పడు సర్వసాధారణమైపోయాయి. ఏ ప్రభుత్వమైన సరే ఆక్రమణలను సహించకూడదు. అలాగే అభివృద్ధి అనేది ప్రణాళికాబద్ధంగా జరగాలి. అప్పుడే ప్రజలు ఆనందకర జీవనాన్ని కొనసాగిస్తారు’ అని వెంకయ్య పేర్కొన్నారు.