ఈ అంశంతో హైదరాబాద్ లో ప్లంబింగ్ కాన్ఫరెన్స్
21 నుంచి 23 వరకు హైటెక్స్ లో నిర్వహణ
నీరు అనేది మానవాళికి అవసరమైన అతి ముఖ్యమైన వనరే కాకుండా మన సంఘాలు, ఆర్థిక వ్యవస్థలకు జీవనాధారమని ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ (ఐపీఏ) పేర్కొంది. అలాంటి నీరు ప్లంబింగ్ లీకేజీల కారణంగా దాదాపు 30 నుంచి 40 శాతం మేర వృథా అవుతోందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో వాటర్.. ది కరెన్సీ (నీరు.. కొత్త కరెన్సీ) పేరుతో ఈనెల 21–23 తేదీల్లో హైటెక్స్ లో ‘30వ ప్లంబింగ్ కాన్ఫరెన్స్’ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. 9 ఏళ్ల తర్వాత దేశంలో జరగనున్న అతిపెద్ద సదస్సు ఇదేనని ఏపీఐ ప్రతినిధులు తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు ఈ సదస్సును ప్రారంభిస్తారని వెల్లడించారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్లంబింగ్, నీరు, శానిటేషన్, భవన నిర్మాణ నిపుణులు పాల్గొంటారని తెలిపారు.
దాదాపు 1500 మంది డెలిగేట్లు దీనికి హాజరవుతారని, 80 మంది ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తారని, సదస్సుకు దాదాపు 8వేల మందికి పైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. 2070 నాటికి నికర-సున్నా ఉద్గారాలను సాధించాలనే భారతదేశ లక్ష్యానికి మద్దతుగా గ్రీన్ క్రెడిట్స్, వాటర్ క్రెడిట్స్ వంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం.. సుస్థిరత, వాతావరణ చర్యలో నీటి కీలక పాత్రను నొక్కి చెప్పే ఉద్దేశంతో వాటర్.. ది కరెన్సీ అనే థీమ్ ను ఎంచుకున్నారు. నీటి నిర్వహణను మెరుగుపరచడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక స్థితిస్థాపకతను పెంపొందించడం లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.
కాగా, ఒక నగరంలో నీటి సరఫరా దాదాపు పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితిని ‘డే జీరో’గా పరిగణిస్తుంటారు. ‘డే జీరో’ చేరుకున్నప్పుడు కుళాయి నీళ్ల సరఫరాకు ఆంక్షలు, మున్సిపాలిటీల్లో పరిమిత స్థాయిలో నీటి వినియోగం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇటీవల బెంగళూరు, చెన్నై ఈ తరహా విపత్కర స్థితులను చూశామని, హైదరాబాద్‌లో అలాంటి పరిస్థితులు రావని ప్లంబింగ్ అసోసియేషన్ పేర్కొంది. ఇక్కడున్న పుష్కలమైన నీటి వనరులతో రెండు దశాబ్దాల కాలం వరకూ ఎలాంటి ఇబ్బందులు లేవని వివరించారు.