-
ముచ్చటగా మూడో ప్రీలాంచ్ ప్రాజెక్టు
-
పది శాతం జరిమానా విధించాలి
-
బిల్డర్ లైసెన్సును రద్దు చేయాలి
-
ప్రీలాంచ్ చేస్తే రెరా నెంబర్ ఇవ్వకూడదు
హైదరాబాద్ నిర్మాణ రంగంలో నెలకొన్న ఓ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటంటే.. రెరా అనుమతి తీసుకోకుండానే.. ఆకాశహర్మ్యాల్ని కడుతున్నామని చెబుతూ.. ప్రజల నుంచి సొమ్ము వసూలు చేయడం ఒక ఫ్యాషనైంది. అధిక ఎస్ఎఫ్‌టీ ఇస్తామంటూ ల్యాండ్ లార్డ్స్‌కు ఆశచూపెట్టి.. ఎంతో కొంత అడ్వాన్సులు చెల్లించి.. ఎక్కడ పడితే అక్కడ స్థలం తీసుకుని.. ప్రీలాంచుల్ని చేయడం ఒక ఫ్యాషన్‌గా మారింది. తాజాగా టీమ్ 4 అనే సంస్థ మియాపూర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వద్ద ముచ్చటగా మూడో ప్రీలాంచ్ ప్రాజెక్టును ప్రారంభించడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. టీమ్ 4 పేరిట.. ఇప్పటివరకూ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసిన చరిత్ర లేని సంస్థ.. ఇంత నిస్సిగ్గుగా మరో ప్రాజెక్టును ప్రీలాంచ్‌లో అమ్ముతున్నదంటే.. రెరా అథారిటీ నిద్రపోతుందా అని నిర్మాణ రంగం ప్రశ్నిస్తున్నది. ఈ క్రమంలో టీమ్-4 అనే సంస్థలో సభ్యులెవరు? వారి కథాకమామీషూ ఏమిటనే విషయం రియల్ ఎస్టేట్ గురు తెలుసుకునే ప్రయత్నం చేసింది.
యూలా కన్‌స్ట్రక్షన్స్ కొండయ్య ఇంతవరకూ నిర్మించిన అపార్టుమెంట్లే మూడు. అవి కూడా ఐదు అంతస్తుల్లోపువే. అందులో ఆకాశహర్మ్యం ఒక్కటి కూడా లేదు.
ఇలా, ఆకాశహర్మ్యాల్ని నిర్మించిన గత చరిత్ర లేని సంస్థలు.. మార్కెట్లోకి వచ్చి స్కై స్క్రేపర్లను కడతామంటే.. బయ్యర్లు గుడ్డిగా ఎలా నమ్ముతున్నారో అర్థం కావట్లేదు. ప్రీలాంచుల్లో ఫ్లాట్లను విక్రయించిన తర్వాత.. మళ్లీ అదే సంస్థ రెరా వద్దకెళ్లి పర్మిషన్ తెచ్చుకుంటుందంటే.. దొంగతనం చేసిన దొంగకు ప్రభుత్వమే పిలిచి అవార్డు ఇచ్చినట్లుగా ఉందని నిర్మాణ రంగం అంటున్నది. కాబట్టి, ప్రీలాంచుల్లో ఫ్లాట్లను అమ్మే సంస్థపై భారీ జరిమానాను విధించాలి. ఆయా కంపెనీ బిల్డర్ లైసెన్సును రద్దు చేయాలని స్థానిక సంస్థలకు రెరా సిఫార్సు చేయాలి. పైగా, ఆయా ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితిలో రెరా అనుమతిని మంజూరు చేయకూడదు. ఇలా రెరా కఠినమైన నిర్ణయాల్ని తీసుకున్నప్పుడే.. హైదరాబాద్లో ప్రీలాంచుల్లో ఫ్లాట్లను విక్రయించడానికి ఎవరూ సాహసించరు.