తెలంగాణ రాష్ట్రం సరికొత్త ఆవిష్కరణలకు అంకురార్పణ చేసినట్లే.. హైదరాబాద్ డెవలపర్లు రియల్ రంగంలో వినూత్న ఆవిష్కరణల్ని ప్రవేశపెడుతున్నారు. దీనికి స్థానిక సంస్థల పర్మిషన్ అవసరం లేదు. రెరా అనుమతి అసలే అక్కర్లేదు. ఇక్కడ డెవలపర్ ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తాడు. తుక్కుగూడలో 150 ఎకరాల్లో డీఎస్ఆర్ – ఎస్ఎస్ఐ అనే సంస్థలు ఈ విధానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ విధానం ఎలా ఉంటుందంటే..
డీఎస్ఆర్- ఎస్ఎస్ఐ అనే సంస్థలు తుక్కుగూడలో 150 ఎకరాల్లో విల్లా ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. భూమి ధరలు చూస్తేనేమో మండిపోతున్నాయి. కాకపోతే, విల్లా ప్రాజెక్టు అయితే చేయాలన్నది ఈ కంపెనీ ఉద్దేశ్యం అనుకుంటా. అందుకే ఈ కంపెనీ ఏం చేస్తుందంటే.. తుక్కుగూడలో ఈ 150 ఎకరాల స్థలంలో పెట్టుబడిదారులతో ఎకరం చొప్పున స్థలం కొనిపిస్తుంది. కనీసం ఎకరం స్థలం కొనిపిస్తుంది. ధరేమో ఎకరానికి రూ.4.25 కోట్ల దాకా ఉంటుంది. ఈ స్థలాన్ని మీరు రైతుల వద్ద కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాక.. మీరు అదే ఎకరాన్ని డెవలప్‌మెంట్ నిమిత్తం డీఎస్సార్- ఎస్ఎస్ఐ సంస్థకు అందజేయాలి. అప్పుడా కంపెనీ 1700 గజాల డెవలప్డ్ ప్లాటును మీకు ఇస్తుంది. గజం ధర 40 వేలు ఉన్నప్పుడు 1700 గజాలు చేతికి రావడమంటే మాటలు కాదు కదా. ఆ తర్వాత అందులోనే విల్లాల్ని కూడా నిర్మిస్తుంది. అలాగైతే మీరు పెట్టే పెట్టుబడికి ఊహించిన దానికంటే అధిక లాభం వస్తుంది.
ఒకవేళ మీరు ఎకరానికి రూ.4.25 కోట్లు పెట్టలేరు.. మీ వద్ద కేవలం కోటీ రూపాయలే ఉందనుకోండి.. మరో ఆప్షన్ కూడా సంస్థ ప్రకటించింది. మోమిన్‌పేట్‌లో ఎకరం స్థలం కోటీ రూపాయలకు కొంటే 1600 గజాలు ఇస్తారట. హైదరాబాద్‌లో అల్ట్రా లగ్జరీ ఫ్లాట్లను నిర్మించే డీఎస్సార్ వంటి బడా కంపెనీలూ ఇలాంటి స్కీముల్ని ప్రవేశపెట్టడం విశేషం. చివరికీ హైదరాబాద్ రియల్ రంగం ఎటువైపు తేలుతుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.