హైదరాబాద్ లో ఎకరం భూమి రూ.100 కోట్లకు అమ్ముడుపోగా.. విశాఖపట్నంలో భూముల వేలానికి స్పందనే కరువైంది. దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలనకు శ్రీకారం చుడతామని సీఎం జగన్ ప్రకటించినా రియల్టర్లకు మార్కెట్ పై నమ్మకం లేనట్టుగా కనిపిస్తోంది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) ఇటీవలి భూముల వేలం సందర్భంగా సరైన స్పందన కొరవడటమే ఇందుకు నిదర్శనం. మధురవాడ ప్రాంతంలోని 87.8 ఎకరాల భూమిని విక్రయించడం ద్వారా నిధులు సమకూర్చుకోవాలని భావించిన వీఎంఆర్డీఏ గతనెల 29, 30వ తేదీల్లో 14 బల్క్ ల్యాండ్ పార్శిళ్లను వేలం వేయాని నిర్ణయించింది. అయితే, ఈ వేలానికి సరైన స్పందన రాలేదు. వేలంలో చదరపు గజం రేటు రూ.30వేల లోపే ప్రకటించినా ఆశించిన స్పందన లేకపోవడం అధికారులను ఆశ్చర్యపరిచింది. గతంలో మధురవాడ ప్రాంతంలోని చిన్న ప్లాట్ల వేలంలో చదరపు గజం దాదాపు రూ.లక్ష పలకగా.. ఈసారి స్పందనే కరువైంది.