దేశవ్యాప్తంగా పలు నగరాల్లో వాయు కాలుష్యం పెరిగి గాలి నాణ్యత తగ్గుతున్న నేపథ్యంలో పలు ప్రభుత్వాలు నివారణ చర్యలకు ఉపక్రమించాయి. అలాగే వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇటీవల బాంబే హైకోర్టు ఆదేశించింది. దీంతో జంట నగరాల్లో గాలి నాణ్యతను పెంపొందించేందుకు నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించిన పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో చాలావరకు ఇప్పటికే ఉండగా.. వీటన్నింటినీ కచ్చితంగా అమలు చేయాలని కార్పొరేషన్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం ప్రతి వార్డులో ప్రత్యేక బృందాలను నియమించింది. జంటనగరాల్లోని 32 వార్డుల్లో 16 స్క్వాడ్లను నియమించారు. ఈ బృందాలు నిర్మాణ స్థలాలను సందర్శించి వాటి ఫొటోలు, వీడియోలు తీస్తాయి. అక్కడి పరిస్థితులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు తేలితే జరిమానా విధించడం లేదా పనులు నిలిపివేత నోటీసులు ఇవ్వడం లేదా ఆ స్థలాన్ని సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ముంబైలోని 100 మంది కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలకు నోటీసులిచ్చింది. నగరంలో గాలి నాణ్యతను పెంపొందించడానికి ధూళిని తగ్గించే నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టంచేసింది. స్ప్రింకర్లు, ఫాగింగ్ మెషీన్లతో వాయు కాలుష్యాన్ని నివారించడానికి బిల్డర్లు చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే వార్డులో అక్రమ డంపింగ్ కు పాల్పడేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఈ చర్యలు తీసుకోవడంలో విఫలమైతే సంబంధిత అధికారులను బాధ్యులు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.