తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మూడో సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మూకుమ్మడి దాడి చేస్తూ.. తమ సొంత మీడియాలో బీఆర్ఎస్ అనుకూల కథనాల్ని వండించడంలో అధికార పార్టీ ముందంజలో ఉంది. రాష్ట్రంలో అధిక శాతం మంది బిల్డర్లు అధికార పార్టీయే మళ్లీ గెలవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే, కోకాపేట్‌లో ఎకరానికి రూ.100 కోట్లు పలికించిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానికే దక్కుతుంది. బుద్వేల్‌లో సైతం ఎకరానికి సుమారు 41 కోట్ల దాకా పలికింది. పైగా, అనేక దేశవిదేశీ సంస్థలు హైదరాబాద్‌లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే.. అభివృద్ధి మొత్తం నిలిచిపోతుందనే భావనలో నిర్మాణ సంఘాల్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది.
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆరంభం నుంచీ నిర్మాణ సంఘాలతో సత్సంబంధాల్ని కొనసాగిస్తున్నారు. నిర్మాణ రంగంలో ఎలాంటి సమస్యలొచ్చినా మంత్రి కేటీఆర్‌కు చెప్పుకోవచ్చనే భావన కొంతమంది బిల్డర్లలో నెలకొంది. అందుకే, కాంగ్రెస్ బదులు ముచ్చటగా మూడోసారీ బీఆర్ఎస్ గెలవాలని మెజార్టీ నిర్మాణ సంఘాలు ముక్తకంఠంతో కోరుకుంటున్నాయి. అందుకే, ఎప్పటిలాగే రియల్ సంఘాలన్నీ కలిసి ఎన్నికల కోసం రియల్ ఎస్టేట్ సమ్మిట్‌ను ఈసారి నిర్వహిస్తున్నాయి. కాకపోతే, గతంలో జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించినప్పుడు బీఆర్ఎస్ విజయ దుందుబి మోగించింది. కానీ, ఇప్పుడేమో వేదిక హెచ్ఐసీసీకి మారింది కాబట్టి.. ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే డిసెంబరు 3 దాకా వేచి చూడాల్సిందే.
ఇల్లు కొనలేని స్థితి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కానీయండి.. రియల్ ఎస్టేట్ రంగంలో కానీయండి.. తెలంగాణ ప్రాంతానికి చెందిన రియల్టర్లు, ప్రమోటర్లకు ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే విమర్శలున్నాయి. అంతెందుకు, మంత్రి కేటీఆర్ సైతం ఇతర బిల్డర్లకు ఇచ్చే ప్రాధాన్యత.. స్థానిక తెలంగాణ బిల్డర్లకు ఇవ్వలేదనే విమర్శలు ముందునుంచీ ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. ఒక్కసారిగా సమీకరణలు మారిపోవడం.. కాంగ్రెస్ గాలీ ఎక్కువగా వీస్తుండటంతో.. ఆ విమర్శలు మరింతగా పెరిగాయి. ఒక ఆంధ్రా నిర్మాణ సంస్థకు సాయం చేయడానికే మంత్రి కేటీఆర్ జీవో నెం 50 అమల్లోకి తెచ్చారనే ఆరోపణలున్నాయి. ఆ జీవో కారణంగానే ల్యాండ్ లార్డులకు అధిక బిల్టప్ ఏరియా రావడంతో హైదరాబాద్‌లో భూముల ధరలు పెరిగాయంటూ నేటికీ కొందరు బిల్డర్లు బాహాటంగానే విమర్శిస్తుంటారు. కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఉస్మాన్ నగర్, కొల్లూరు వంటి ప్రాంతాలకు ఆ జీవోను పరిమితం చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అలా కాకుండా నగరమంతటా జీవోను వర్తింజేయడం వల్ల.. ఆకాశహర్మ్యాల్ని ఎక్కడ పడితే అక్కడ నిర్మించేందుకు డెవలపర్లు పోటీ పడుతున్నారు. ఫలితంగా, భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చేశాయి. ఇదే క్రమంలో సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం సొంతిల్లు కొనుక్కోలేని విధంగా ఫ్లాట్ల రేట్లు పెరగడంతో.. వాటిలో కొనలేనివారంతా ప్రీలాంచుల్లో కొనుగోలు చేసి దారుణంగా మోసపోయారు. ఈ ప్రీలాంచులకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయడంలో విఫలమైందని ఇళ్ల కొనుగోలుదారులు భావిస్తున్నారు.
సీబీఎన్ తప్పే కేటీఆర్ కూడా..
హైదరాబాద్ విషయంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన తప్పులే కేటీఆర్ చేస్తున్నారనే విమర్వలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎందుకంటే, 2004 ఎన్నికల్లో సీబీఎన్ హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టి గ్రామీణ ప్రాంతాల్ని మరిచిపోయారు. అదేవిధంగా, మంత్రి కేటీఆర్ కేవలం భాగ్యనగరం మీదే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ.. హైదరాబాద్ గ్రోత్ స్టోరీని ప్రొజెక్ట్ చేయడం మీదే అధిక దృష్టి సారిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలా చేయడం వల్లే గతంలో సీబీఎన్ ఓటమీ పాలయ్యారని చెబుతున్నారు. లక్షా ముప్పయ్ వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎంత హైప్ చేసినా.. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంతో ప్రజల్లో ఒక్కసారి వ్యతిరేకత ఏర్పడిందని అభిప్రాయపడుతున్నారు. గెలుపోటములు సహజమనే రీతిలో కేటీఆర్ పలు సమావేశాల్లో చేసిన ప్రసంగం చూసి కూడా ప్రజలూ విస్తుపోతున్నారు. అంతెందుకు శుక్రవారం నోవాటెల్‌లో జరిగిన సభలోనూ కేటీఆర్ పెద్దగా ఉత్సాహంగా కనిపించలేదని కొందరు డెవలపర్లు వ్యాఖ్యానించడం గమనార్హం.
చిన్న బిల్డర్లు మటాష్?
ప్రస్తుత ఎన్నికల్లో నిర్మాణ సంఘాలు అధికార పార్టీకి మద్ధతు పలుకుతుండగా.. కొందరు బిల్డర్లు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అధికార పార్టీ 2014 నుంచి నిర్మాణ రంగానికి మేలు చేయడం కంటే కీడే ఎక్కువ చేసిందని కొందరు అంటున్నారు. బడా బిల్డర్లు తప్ప చిన్న డెవలపర్లు వ్యాపారం చేసే స్థితిలో లేరని.. వారి సమస్యల్ని పట్టించుకునే పరిస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం లేదనే విమర్శలున్నాయి. శుక్రవారం నోవాటెల్‌లో జరిగిన కేటీఆర్ మీటింగుల్లో పాల్గొన్న పలువురు బిల్డర్లు బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం గమనార్హం. హైదరాబాద్ అభివృద్ధి గురించి ఇటీవల రేవంత్ రెడ్డి స్పష్టతనివ్వడంతో నిర్మాణ సంఘాలు సంయమనం పాటించాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించాల్సిన సంఘ పెద్దలే ఇలా అధికార పార్టీకి తొత్తులా వ్యవహరించడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానమంత్రి మోడీ ట్రంప్‌కు మద్ధతు పలికితే ఏమైంది? ఒకవేళ మన రాష్ట్రంలోనూ అలాంటి ఫలితమే పునరావృతమైతే ఎలా? నిర్మాణ సంఘ పెద్దలు ఆలోచించాలని కోరుతున్నారు.