మూడేళ్లలో ఇళ్ల ధరలు 33 శాతం అధికం
అనరాక్ నివేదికలో వెల్లడి
ఇళ్ల అద్దెల్లో గచ్చిబౌలి వెరీ హాట్‌గా మారింది. దేశవ్యాప్తంగా ఇళ్ల ధరల పెరుగుదలలో గచ్చిబౌలీయే టాప్‌లో ఉంది. గత మూడేళ్లలో ఇళ్ల ధరలు ఏకంగా 33 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు ఇదే కాలంలో 13-33 శాతం మధ్య పెరగడం గమనార్హం. ఈ మేరకు అనరాక్ ఓ నివేదిక విడుదల చేసింది. గచ్చిబౌలిలో 2023 అక్టోబర్ నాటికి ఇళ్ల ధర చదరపు అడుగుకు రూ.6,355కు చేరింది. 2020 అక్టోబర్ నాటికి ఇక్కడ చదరపు అడుగు ధర రూ.4,790గా ఉండేది. ఇక కొండాపూర్‌లోనూ చదరపు అడుగుకు ధర 31 శాతం పెరిగి, రూ.4,650 నుంచి రూ.6,090కు చేరింది. సౌకర్యవంతమైన, విశాలమైన ఇళ్లను ఎక్కువ మంది కోరుకుంటుండటంతో అద్దెలు పెరిగినట్టు నివేదిక పేర్కొంది. ఇక బెంగళూరు వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఇళ్ల ధరలు 29 శాతం వృద్ధితో చదరపు అడుగుకు రూ.6,325కు చేరాయి. ఢిల్లీ, ముంబైల్లో చదరపు అడుగుకు 13-27 శాతం మధ్య గత మూడేళ్లలో పెరిగాయి. పుణెలో ఐటీ కంపెనీలకు కేంద్రాలైన వాఘోలిలో 25 శాతం, హింజేవాడిలో 22 శాతం, వాకాడ్‌లో 19 శాతం చొప్పున అద్దెలు పెరిగాయి.