- ఏడు నగరాల్లో రూ.4,063 కోట్ల
విలువైన అమ్మకాలు
దేశవ్యాప్తంగా విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో రూ.40 కోట్లకు పైగా ధర కలిగిన ఇళ్లు భారీగా నమోదయ్యాయని, వీటి లావాదేవీల విలువ రూ. 4,063 కోట్ల మేర నమోదయ్యాయని పేర్కొంది.
ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణెల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 58 ఇళ్లు అమ్ముడైనట్టు తెలిపింది. గతేడాది ఈ విభాగంలో కేవలం 13 ఇళ్లు మాత్రమే అమ్ముడు కాగా, ఈసారి అవి భారీగా పెరిగాయని వివరించింది. లగ్జరీ ఇళ్ల అమ్మకాల్లో ముంబై మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో అత్యంత ఖరీదైన ఇళ్లు 58 యూనిట్లు అమ్ముడుపోగా, అందులో 53 యూనిట్లు ఒక్క ముంబైలోనే విక్రమయ్యాయి. ఢిల్లీలో నాలుగు యూనిట్లు అమ్ముడు కాగా, హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో రూ.40 కోట్ల పైన విలువ చేసే ఒక యూనిట్ అమ్ముడైంది. ముంబైలో అమ్ముడైన 53 యూనిట్లలో మూడు ఇళ్ల ధర రూ.200 కోట్లపైనే ఉండటం గమనార్హం. ఏడు ఇళ్ల ధర రూ.100-200 కోట్ల మధ్య ఉంది.
ఢిల్లీలో రెండు యూనిట్ల ధర రూ.100 కోట్లపైన ఉంది. ‘కరోనా మహమ్మారి తర్వాత నుంచి లగ్జరీ, అల్ట్రా లగ్జరీ ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. ధనవంతులు (హెచ్‌ఎన్‌ఐ), అధిక ధనవంతులు (అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలు) ఖరీదైన ఇళ్లను పెట్టుబడి కోసం, వ్యక్తిగత అవసరాల దృష్ట్యా కొనుగోలు చేస్తున్నారు’’అని అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి తెలిపారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లలో అస్థిరతలు నెలకొన్నగ నేపథ్యంలో హెచ్‌ఎన్‌ఐలు తమ పెట్టుబడుల పోర్టుఫోలియోల్లో మార్పులు చేసుకోవడంతో అల్ట్రా లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరిగినట్టు చెప్పారు.