భారత్ లో వ్యవసాయం తర్వాత అతి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగం రియల్ ఎస్టేట్. ఇందులో పెట్టుబడులు పెట్టాలంటే బోలెడంత డబ్బు ఉండాలనేది ఒకప్పటి మాట. ఇప్పుడు తక్కువ మొత్తంతోనే ఇందులో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అందుకు సులభమైన మూడు మార్గాలివిగో..
పాక్షిక రియల్ ఎస్టేట్ యాజమాన్య ప్లాట్ ఫారంలు..
భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో పాక్షిక రియల్ ఎస్టేట్ యాజమాన్య ప్లాట్ ఫారంలు అనేవి ఓ కొత్త ఒరవడి సృష్టించాయి. ఓ పిజ్జాను స్నేహితులతో షేర్ చేసుకున్న తరహాలోనే ఓ ఖరీదైన స్థిరాస్తిని మరికొంతమందితో కలసి కొనుగోలు చేయడమే దీని ఉద్దేశం. అటు కమర్షియల్, ఇటు రెసిడెన్షియల్ విభాగంలోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి. ముంబై, పుణె, గోవా, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఈ ఒరవడి కొనసాగుతోంది.
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్స్..
రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం కోసం 2014 సెప్టెంబర్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. ఆదాయం తీసుకొచ్చే రియల్ ఎస్టేట్ లో స్టాక్ మార్కెట్ తరహాలో పెట్టుబడులు పెట్టడానికి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్(ఆర్ఈఐటీ) ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈక్విటీ ఆర్ఈఐటీ (ఆదాయాన్ని అందించే ప్రాపర్టీలు), మోర్టగేజ్ ఆర్ఈఐటీ (రియల్ ఎస్టేట్ కంపెనీలకు లోన్లు ఇవ్వడం), హైబ్రిడ్ ఆర్ఈఐటీలు అందుబాటులో ఉన్నాయి. ఈక్విటీ, మోర్టగేజ్ కలిసి ఉన్నదే హైబ్రిడ్ ఆర్ఈఐటీ.
రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్..
రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్ రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడతాయి. ఈ నిధులు రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రాపర్టీలు నిర్మించేందుకు మూలనిధిలా ఉపయోగపడతాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ వివిధ ఆర్ఈఐటీలు లేదా రియల్ ఎస్టేట్ సంబంధిత స్టాక్స్ లో పెట్టుబడులు పెడతాయి. ఈ మూడు అంశాలూ రిటైల్ ఇన్వెస్టర్లు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడానికి సహకరిస్తాయి. త్వరగా నగదు కావాలనుకునేవారు ఆర్ఈఐటీలు, రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్ వైపు మొగ్గు చూపాలి. దీర్ధకాలిక లాభాల కోసం చూసేవారికి పాక్షిక రియల్ ఎస్టేట్ యాజమాన్య ప్లాట్ ఫారంలు మంచి చాయిస్.