హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఫ్లాట్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ప్రాజెక్టుల్ని సందర్శించేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. అడపాదడపా కొందరు కొనుగోలుదారులు నిర్మాణాల్ని సందర్శిస్తున్నప్పటికీ.. తుది నిర్ణయం మాత్రం తీసుకోవట్లేదు. అసలెందుకిలా జరుగుతోంది? ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు కొనసాగుతుంది?
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని భావించిన బిల్డర్లు షాక్ నుంచి ఇంకా తేరుకోవడం లేదు. అందుకే, తమ ప్రాజెక్టుల ప్రచార కార్యకలాపాల్ని కూడా పెద్దగా నిర్వహించడం లేదు. ఇలా అనేకమంది డెవలపర్లు వ్యవహరించడం వల్ల.. కొనుగోలుదారుల్లోనూ ప్రతికూలంగా ఆలోచించడం ఆరంభించారు. అందుకే, పెద్దగా ప్రాజెక్టుల్ని సందర్శించట్లేదు. అడపాదడపా కొందరు వివిధ ప్రాజెక్టుల్ని సందర్శించి.. ఎగ్జిక్యూటివ్‌లతో మాట్లాడుతున్నా.. తుది నిర్ణయం మాత్రం తీసుకోవట్లేదు. కర్ణుడి చావుకి లక్ష కారణాలు అన్నట్లు.. హైదరాబాద్‌లో ఫ్లాట్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టడానికి అనేక కారణాలని చెప్పొచ్చు.