- భూముల మార్కెట్ విలువను పెంచుతారా? లేదా?
- రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయా? లేవా?
- ఒకవేళ పెంచితే ఎప్పట్నుంచి అమల్లో వస్తుంది?
గత కొద్ది రోజుల్నుంచి.. తెలంగాణ రాష్ట్రమంతటా ఇదే చర్చ జరుగుతోంది. సబ్ కమిటీ భూముల విలువల్ని పెంచాలన్న నివేదిక అందజేసిన తర్వాత.. సీఎం కేసీఆర్ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. కొందరైతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏడున్నర శాతం అవుతాయని జోస్యం పలికారు. కాకపోతే, ఇంతవరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇంతకీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయా? లేవా? ఒకవేళ పెంచాలని నిర్ణయిస్తే.. ఎప్పట్నుంచి పెంచుతారు?
భూముల మార్కెట్ విలువల పెంపుదల.. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడంపై.. ఒక భిన్నమైన వాదన వినిపిస్తోంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పెద్దగా ఇష్టం లేదని తెలిసింది. అందుకే, గత ఏడేళ్ల నుంచి భూముల విలువల్ని పెంచలేదని అధికారులు అంటున్నారు. కాకపోతే, తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల హైదరాబాద్లో రియల్ రంగానికి ఎక్కడ్లేని గిరాకీ ఏర్పడుతోంది. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ భూముల్ని కొనేవారు పెరిగారు.