-
- కొల్లూరు ఐటీ హబ్.. 640 ఎకరాల గుర్తింపు..
- పది లక్షల మందికి ఉపాధి అవకాశాలు..
కొల్లూరు ( Kollur ) లో ఐటీ హబ్ వస్తుందని.. ఇక్కడేదో రాత్రికి రాత్రే అద్భుతం జరుగుతుందని ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు. ఇలాంటి వార్తలు కేవలం అక్కడి భూముల ధరల్ని కృత్రిమంగా పెంచుకోవడానికి పనికొస్తుందని గుర్తుంచుకోండి. బుద్వేల్‌లో ఐటీ పార్కు అన్నారు.. తర్వాత ఏమైంది? ఐటీ అయితే రాలేదు కానీ.. భూముల ధరలు మాత్రం పెరిగిపోయాయి. అప్పటివరకూ అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో.. మధ్యతరగతి ప్రజానీకానికి రూ.40 నుంచి 50 లక్షల్లో ఫ్లాట్ లభించేది. కానీ, ఒక్కసారిగా రేట్లు పెరగడంతో అక్కడా డబుల్ బెడ్ రూం ఫ్లాట్లు కొనలేని దుస్థితి నెలకొంది. కొల్లూరులో ఇదే పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
రేటు పెంచుతారు.. జాగ్రత్త!
కొల్లూరు ప్రాంతం రానున్న రోజుల్లో డెవలప్ అవుతుందనే విషయంలో సందేహం లేదు. కాకపోతే, ఇప్పటికిప్పుడే అక్కడా నివాసయోగ్యమైన పరిస్థితుల్లేవు. రహదారులు, మురుగునీటి సౌకర్యం, ఆస్పత్రులు, సూపర్ మార్కెట్లు, షాపింగ్ ప్రాంతాలు, రెస్టారెంట్లు వంటివి పెద్దగా డెవలప్ కాలేదు. అందుకే, ధర కొంత అందుబాటులో ఉంది. ఇక ఐటీ హబ్ వస్తుందనే వార్త.. అక్కడి యూడీఎస్ కంపెనీలకు.. రియాల్టీ ఏజెంట్లకు పెద్ద పండగే అని చెప్పొచ్చు. ఈ దెబ్బతో అమ్మకాల్ని పెంచుకుంటారు. వీలైతే రేటు పెంచే ప్రయత్నం చేస్తారు. ఓ పదేళ్ల తర్వాత పెరగాల్సిన రేటును ఇప్పుడే పెంచేసి.. మార్కెట్‌ను త్రిశంకు స్వర్గంలో నెట్టేస్తారు. మహేశ్వరం, పోచారం, బుద్వేల్, కొంపల్లి, సుల్తాన్పూర్ వంటి ప్రాంతాల్లో ఇలాగే రేట్లు పెంచేసి.. రియల్ సంస్థలు, ఏజెంట్లు కలిపి మార్కెట్ ను సర్వనాశనం చేశారు. కాబట్టి, రేటు విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాకే కొనాలా? వద్దా? అనే అంశంలో తుది నిర్ణయం తీసుకోండి.