హైదరాబాద్ ఓ ప్రపంచస్థాయి నగరంగా ఖ్యాతినార్జించాలంటే.. మొత్తం సిటీకి కలిపి సమగ్రమైన మాస్టర్ ప్లాన్ ఉండాల్సిందే. నగరం నాలుగువైపులా అన్ని ప్రాంతాలకు భూవినియోగం సమపాళ్లలో (బ్యాలెన్సింగ్‌గా) ఉండాలి. వెస్ట్ జోన్‌లో గ్రీనరీకి సంబంధించిన బఫర్ జోన్లు పెద్దగా లేవు. ఇతర ప్రాంతాల్లో అగ్రికల్చర్, రిక్రియేషన్ జోన్లు ఎక్కువగా ఉన్నాయి. ఫిజిబిలిటీని దృష్టిలో పెట్టుకుని.. గ్రౌండ్ రియాల్టీని అర్థం చేసుకుని కొత్త మాస్టర్ ప్లాన్‌లో రోడ్లను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతమున్న రోడ్లను వెడల్పు చేస్తూ.. ప్రతిపాదిత రోడ్లను ఫిజిబిలిటీ ప్రకారం ఏర్పాటు చేస్తూ.. వాటిని గ్రిడ్ రోడ్లతో అనుసంధానం చేస్తే.. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటానికి ఆస్కారం ఉండదు. కనీసం వచ్చే ముప్పయ్యేళ్ల అవసరాల్ని తీర్చే విధంగా రోడ్లను వెడల్పు చేయడాన్ని ప్రతిపాదించాలి.
హైదరాబాద్లో ఇప్పటి వరకూ ఐదు మాస్టర్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. జీహెచ్ఎంసీ కోర్ ఏరియా, సీడీఏ, హెచ్ఎండీఏ ఏరియా (2031 మాస్టర్ ప్లాన్), హడా ప్రాంతం, హెచ్ఎండీఏ కోర్ ఏరియా. ఈ ఐదు మాస్టర్ ప్లాన్ భూవినియోగం కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ, భవన నిర్మాణ నిబంధనలు మాత్రం ఒకేరకంగా ఉన్నాయి. అదే ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ వరకూ ఉండే గ్రోత్ కారిడార్‌లో.. నిర్మాణ నిబంధనలు వేరుగా ఉన్నాయనే విషయాన్ని మనం గమనించాలి. అయితే, గత ప్రభుత్వం అన్ని మాస్టర్ ప్లాన్లను కలిపి ఇంటీగ్రేటెడ్‌గా రూపొందిస్తామని అనేకసార్లు చెప్పినప్పటికీ.. ఎందుకో కానీ, అది వాస్తవ రూపం దాల్చలేదు.
దూరదృష్టి కొరవడిందా?
ఇప్పుడున్న మాస్టర్ ప్లాన్‌లలో ఒక్క సీడీఏ మాస్టర్ ప్లాన్‌లో మాత్రమే.. అన్ని ప్రాంతాల్ని మల్టీపర్పస్ జోన్లుగా పేర్కొన్నారు. కాబట్టి ఆ ఏరియాల్లో విచ్చలవిడిగా కట్టడాలు రావడం వల్ల కాంక్రీటు జంగిల్లా మారింది. అయితే, ఇక్కడి నిర్మాణాల్ని మనం గమనిస్తే ఎక్కడా లంగ్ స్పేసెస్ పెద్దగా కనిపించవు. అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో గ్రీనరిని పొందుపర్చలేకపోయారు. అప్పుడే మాస్టర్ ప్లాన్‌లో లంగ్ స్పేసెస్ ఏర్పాటు చేసి ఉంటే.. సైబరాబాద్ ప్రాంతంలో పచ్చదనం కాస్త అయినా దర్శనమిచ్చేది.
గత పది, పదిహేనేళ్లలో గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, నానక్‌రాంగూడ, విప్రో సర్కిల్ వంటి ప్రాంతాలు ఎంత రద్దీగా తయారయ్యాయో మనం కళ్లారా చూస్తున్నాం. హైటెక్ సిటీ, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో ఎన్ని ఫ్లైఓవర్లు వేసినా, స్కైవాక్‌లు ఏర్పాటు చేసినా, మెట్రో రైలు సదుపాయాన్ని కల్పించినా.. ట్రాఫిక్ నిత్యనరకం చూపిస్తోంది. అదేదో, సీడీఏ మాస్టర్ ప్లాన్ తయారీ చేసేటప్పుడే..మరింత వెడల్పు రోడ్లను ప్రతిపాదించి ఉంటే ఈ సమస్య ఏర్పడేది కాదు. మాస్టర్ ప్లాన్‌ను రూపొందించేటప్పుడు కనీసం వచ్చే ముప్పయ్ ఏళ్లలో పెరిగే జనాభా, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకోకపోవడం వల్ల మన సీడీఏ ప్రాంతం ప్రస్తుతం నరకప్రాయంగా మారింది. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుతం నగరం నలువైపులా కమర్షియల్, ఆఫీస్ స్పేసెస్, రెసిడెన్షియల్, గ్రీన్ బెల్టులు అవసరమైన నిష్పత్తిలో ఉండేలా కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలి. అప్పుడే, ట్రాఫిక్, మంచినీరు, డ్రైనేజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు లేకుండా.. ఒక పాశ్చాత్య నగరం తరహాలో హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న నాలుగు మాస్టర్ ప్లాన్లలో మిక్స్‌డ్ యూజ్ జోన్ చాలా తక్కువగా పొందుపరిచారు. అరవై ఫీట్ల పైగా ఉన్న రోడ్లలో మిక్స్‌డ్ యూజ్ జోన్‌ను పొందుపరిస్తే.. అక్రమ కట్టడాల్ని కొంత నిరోధించడానికి అవకాశముంటుంది. గ్రౌండ్‌లో కమర్షియల్, పైన రెసిడెన్షియల్ బిల్డింగులకు అనుమతినిచ్చేలా కొత్త మాస్టర్ ప్లాన్లో రూపొందించాలి. నగరం నలువైపులా అభివృద్ధి ఉండేలా.. ల్యాండ్ యూజ్‌ను బ్యాలెన్స్ చేస్తూ రూపొందించాలి. నగరం నలువైపులా విస్తరించేలా కొత్త మాస్టర్ ప్లాన్‌ను తయారు చేయాలి.