poulomi avante poulomi avante

హైద‌రాబాద్‌ .. ఫ్లాట్స్ వెరీ కాస్ట్లీ గురు

నిన్న‌టివ‌ర‌కూ.. హైద‌రాబాద్ అంటే.. అందుబాటు ధ‌ర‌లున్న న‌గ‌రం. ముంబై, బెంగ‌ళూరు, చెన్నై, ఢిల్లీ వంటి న‌గ‌రాల‌తో పోల్చితే ఇక్క‌డ ఫ్లాట్ల రేట్లు చౌక‌గా ఉండేవి. బ‌య‌ట్నుంచి న‌గ‌రాన్ని చూసే వారికి అపార్టుమెంట్ ధ‌ర‌ త‌క్కువ‌ అనిపించేది. కానీ, క్ర‌మ‌క్ర‌మంగా ఆ ప్ర‌త్యేక‌త‌ను భాగ్య‌న‌గ‌రం కోల్పోతుంది. ధ‌ర‌ల విష‌యంలో ఇప్పుడు హైద‌రాబాద్ ఇత‌ర మెట్రో న‌గ‌రాల‌తో పోటీ ప‌డే స్థాయికి చేరుకుంటోంది. మ‌రి, ఈ పెరుగుద‌ల దేనికి సంకేతం? కృత్రిమంగా పెంచిన ధ‌ర‌ల వ‌ల్లే న‌గ‌రంలో ఇళ్ల‌ను కొన‌డానికి చాలామంది ముందుకు రావ‌డం లేదా? ఈ నేప‌థ్యంలో సామాన్యులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకం సొంతింటి క‌ల తీరాలంటే ఏం చేయాలి?

తెలంగాణ వ‌చ్చిన కొత్త‌లో న‌గ‌రానికి, శివారు ప్రాంతాల మ‌ధ్య ఫ్లాట్ల ధ‌ర‌ల విష‌యంలో స్ప‌ష్ట‌మైన తేడా క‌నిపించేది. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. అటు వనస్థలిపురం అయినా ఇటు మియాపూర్ అయినా రేటు ఒకటే. ఉప్పల్ అయినా అప్పా జంక్షన్ అయినా ధర సమానంగా ఉంది. హైద‌రాబాద్‌లో 2019 ఎన్నిక‌ల తర్వాత పెరిగిన ఫ్లాట్ల ధ‌ర‌ల కార‌ణంగా.. అల్పాదాయ వ‌ర్గాలు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ సొంతింటి క‌ల తీర‌డం క‌ష్టంగా మారింది. ఇప్పుడు ఫ్లాట్ కొనాలంటే.. న‌గ‌రాన్ని దాటి శివార్ల‌కు వెళ్లాల్సిన దుస్థితి నెల‌కొంది. ఒక‌ప్పుడు శివారు ప్రాంతాలంటే ఎల్‌బీన‌గ‌ర్‌, చందాన‌గ‌ర్‌, మ‌ణికొండ‌, ఉప్ప‌ల్‌, బోయిన్‌ప‌ల్లి వంటి ప్రాంతాలు క‌నిపించేవి. ఇప్పుడేమో న‌గ‌ర ప‌రిధి దాటి.. హ‌య‌త్ న‌గ‌ర్‌, బీరంగూడ‌, నార్సింగి, మేడ్చ‌ల్ దాకా వెళ్లాల్సిన దుస్థితి నెల‌కొంది. అక్క‌డికి వెళ్లినా.. రెండు ప‌డ‌క గ‌దుల ఫ్లాట్ కోసం రూ.50 ల‌క్ష‌ల‌కు పైగా రేటు పెట్టాల్సిందే. మ‌రి, రియ‌ల్ రంగం అభివృద్ధి చెందుతుంద‌ని సంతోషించాలా? లేక ఫ్లాట్లు సామాన్యుల‌కు అందుబాటులో ఉండ‌టం లేద‌ని చింతించాలో తెలియ‌డం లేద‌ని ప‌లువురు రియ‌ల్ట‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

2017 త‌ర్వాతే పెరుగుద‌ల‌..

2017 త‌ర్వాత ఫ్లాట్ల ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా పెరిగాయి. శివారు ప్రాంతాల్లో ఆ పార్కు.. ఈ పార్కు వ‌స్తుంద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌డంతో.. ఆయా ఏరియాల్లో ఒక్క‌సారిగా భూముల రేట్లు ఆకాశాన్నంటాయి. సుల్తాన్ పూర్‌లో ప్లాస్టిక్ పార్కు రాక ముందు అక్క‌డ గజం ధ‌ర కేవ‌లం మూడు వేల‌లోపే ఉండేది. కానీ నేడో, ఎనిమిది నుంచి ప‌ది వేలు పెడితే త‌ప్ప గ‌జం స్థ‌లం దొర‌క‌ని దుస్థితి. పోనీ, అక్క‌డేమైనా ప్లాస్టిక్ పార్కుల్లో సంస్థ‌లొచ్చేసి ప్ర‌జ‌ల‌కు ఉద్యోగాలు వ‌చ్చేశాయా? అంటే అదీ లేదు. బుద్వేల్ ఐటీ పార్కు ప్ర‌క‌ట‌న వ‌ల్ల అక్క‌డి డెవ‌ల‌ప‌ర్లు చ‌ద‌ర‌పు అడుక్కీ వెయ్యి నుంచి రెండు వేలు పెంచేశారు. కొంప‌ల్లిలో ఐటీ పార్కు ప్ర‌క‌ట‌న‌తో అక్క‌డా రేట్లు పెరిగాయి. ఇలా, ఇబ్బ‌డిముబ్బడిగా రేట్లు పెర‌గ‌డంతో సామాన్యులు సైతం సొంతిల్లు కొనలేక‌పోతున్నారు.

తెలంగాణ వచ్చిన కొత్తలో హైదరాబాద్లో ఫ్లాట్లు ధరలెలా ఉన్నాయి? 2017లో ఎంత‌కు చేరాయి? ప్ర‌స్తుతం రేటు ఎలా ఉందో తెలియాలంటే ఈ కింది ప‌ట్టిక చూడాల్సిందే.

పలు ప్రాంతాలు 2014 2017 2021
అమీర్ పేట్ 4000 4800 8000
సనత్ నగర్ 3600 4200 7000
హిమాయత్ నగర్ 4600 6000 8000
జూబ్లీహిల్స్ 6000 8000 12000
శ్రీనగర్ కాలనీ 4500 6500 10000
మోతీనగర్ 2200 3400 5000
కేపీహెచ్బీ కాలనీ 3500 4600 8000
మాదాపూర్ 4000 5200 10000
మియాపూర్‌ 2400 3600 6000
చందానగర్ 2400 3000 5400
అల్వాల్ 2400 2800 5000
బోయిన్ పల్లి 2600 3400 5600
కొంపల్లి 2400 3400 5000
ఎల్ బీ నగర్ 2600 3200 6000
ఉప్పల్ 2600 3200 5000
అప్పా జంక్షన్ 2600 3400 5600

 

ఈ ప‌ట్టికను క్షుణ్నంగా గ‌మ‌నిస్తే.. 2014లొ అమీర్‌పేట్‌లో ఫ్లాట్ ధ‌ర రూ.4000 ఉండేది. కానీ, నేడో ఎనిమిది వేలు పెట్టినా ఫ్లాట్లు దొర‌క‌ని దుస్థితి. మాదాపూర్‌లో 2017లో చ‌.అ.కీ. 5200గా ఉన్న ఫ్లాట్ రేటు ప్ర‌స్తుతం రూ.10,000కు చేరింది. శ్రీన‌గ‌ర్ కాల‌నీలో 4500 చ‌ద‌ర‌పు అడుక్కీ ఉన్న రేటు ప్ర‌స్తుతం ప‌ది వేలు పెడితే త‌ప్ప ఫ్లాట్లు దొర‌క‌ని ప‌రిస్థితి నెల‌కొంది. జూబ్లీహిల్స్ లో ఏడేళ్ల క్రితం చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.6000 ఉండ‌గా.. ప్ర‌స్తుతం రూ.12,000కు చేరింది. మియాపూర్‌లో 2400 చ‌ద‌ర‌పు అడుక్కీ ఉన్న రేటు ప్ర‌స్తుతం రూ.6000కు చేరుకుంది. ఎల్‌బీన‌గ‌ర్లో ఇంచుమించు ఇదే ప‌రిస్థితి. సెక్ర‌టేరియ‌ట్ నుంచి సుమారు 15 కిలోమీట‌ర్ల దూర‌ముండే బండ్ల‌గూడ‌లో ఫ్లాట్ల ధ‌ర చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.5,600 చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం ఇక్క‌డ ఫ్లాట్ల ధ‌ర కేవ‌లం రూ.3,400కి అటుఇటుగా ఉండేద‌నే విష‌యం గుర్తుంచుకోండి.

ప్ర‌భుత్వ‌మే నిర్మించాలి..

ఉప్ప‌ల్ భ‌గాయ‌త్ వంటి ప్రాంతాల్లో భూమిని సేక‌రించి ప్లాట్ల‌ను విక్ర‌యించిన హెచ్ఎండీఏ.. కొల్లూరులోనూ భూమిని స‌మీక‌రించే ప్ర‌య‌త్నాల్ని చేప‌డుతోంద‌ని స‌మాచారం. ఒక‌వేళ ప్ర‌భుత్వానికి ఇలాంటి ఆలోచ‌న‌లుంటే గ‌న‌క‌.. అక్క‌డే మ‌ధ్య‌త‌ర‌గ‌తి, ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకానికి అవ‌స‌ర‌మ‌య్యేలా ఫ్లాట్ల‌ను నిర్మిస్తే ఉత్త‌మం. దీని వ‌ల్ల అటు మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల సొంతింటి క‌ల నెర‌వేరుతుంది. ఇలా, న‌గ‌రానికి నాలుగు వైపులా ప్ర‌భుత్వం అపార్టుమెంట్ల‌ను క‌ట్టిస్తే స‌రిపోతుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ నిర్మాణ సంస్థ‌లు ఎలాగూ సామాన్య‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకాన్ని దృష్టిలో పెట్టుకుని ఇళ్ల‌ను క‌ట్ట‌డం లేదు. వీరు ఎక్కువ‌గా పెట్టుబ‌డిదారులు, ప్ర‌వాస భార‌తీయులు, హై నెట్‌వ‌ర్క్ ఇండివిడ్యువ‌ల్స్ కోసం నిర్మాణాల్ని చేప‌డుతున్నారు. కాబ‌ట్టి, ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం ఈ కోణంలో ఆలోచించి ఫ్లాట్ల‌ను క‌డితే సామాన్యుల సొంతింటి క‌లను తీర్చిన‌ట్లు అవుతుంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles