- 2022తో పోలిస్తే 2023లో 25 శాతం పెరుగుదల
ముత్యాలనగరంగా పేరున్న మన భాగ్యనగరం.. దేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరం ర్యాంకు సంపాదించిన మన హైదరాబాద్.. రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరమైన వృద్ధితో ముందుకెళుతోంది. ప్రాపర్టీ ధరలు పెరుగుతున్నప్పటికీ రియల్ బూమ్ కూడా అలాగే కొనసాగుతోంది. గతేడాది ప్రాపర్టీ లావాదేవీలు 25 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. 2022తో పోలిస్తే 2023లో రియల్ లావాదేవీలు 25 శాతం మేర పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. తద్వారా ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ రూపేణా భారీగా ఆదాయం కూడా వచ్చినట్టు తెలిపింది. గతేడాది నవంబర్ వరకు 6,268 ప్రాపర్టీలతో రూ.3,741 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు వెల్లడించింది. అంతేకాకుండా చాలామంది ఖరీదైన ఇళ్ల వైపు మొగ్గు చూపిస్తున్నారని, ఎక్కువ సౌకర్యాలు ఉన్న ఇళ్లకే ఓటేయడంతోపాటు భద్రతాపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని నివేదిక పేర్కొంది. తద్వారా ప్రీమియం హౌసింగ్ యూనిట్లకు డిమాండ్ పెరిగిందని విశ్లేషించింది.