కొనుగోలుదారుల నుంచి ప్రీలాంచ్ స్కీమ్‌లో.. వందల కోట్లను వసూలు చేసి.. ప్రాజెక్టును మొదలెట్టకుండా హోమ్ బయ్యర్లనే ఉల్టా వేధిస్తున్న.. భువనతేజ ఇన్ఫ్రా ఎండీ చక్కా వెంకట సుబ్రమణ్యంను సీసీఎస్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఇటీవల సుమారు పన్నెండు మంది కొనుగోలుదారులు ఒక బృందంగా ఏర్పడి.. సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో పలు ప్రీలాంచ్ ప్రాజెక్టుల్ని ఆరంభించి.. ధర తక్కువంటూ ప్రచారం చేయడంతో.. సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం.. హండ్రెడ్ పర్సంట్ పేమెంట్‌ను అందజేశారు. అయితే, ఏళ్లు గడుస్తున్నా బయ్యర్లలో ఆందోళన మొదలైంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక కొనుగోలుదారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు అపార్టుమెంట్ కట్టక.. ఇటు సొమ్ము వెనక్కి ఇవ్వక.. భువనతేజ చక్కా వెంకటసుబ్రమణ్యం మానసిక వేదనకు గురి చేస్తున్నాడని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారని సమాచారం. ఈ వార్త వినగానే కొందరు బాధితులు షాక్‌కు గురయ్యారు. తమ సొమ్ము వెనక్కి వస్తుందో లేదోనని మరికొందరు దిగులు చెందుతున్నారని తెలిసింది. సుబ్రమణ్యంను అరెస్టు చేసినందుకు ఇంకొందరు ఆనందం వ్యక్తం చేశారు. కాకపోతే, ఈ అరెస్టుకు సంబంధించి పోలీసులు అధికారికంగా ఎప్పుడు వెల్లడిస్తారేమోనని బయ్యర్లు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
* ప్రీలాంచ్ స్కీముల పట్ల గత ప్రభుత్వం పెద్దగా పట్టించుకునేది కాదు. రెరాకు శాశ్వత ఛైర్మన్‌ను ఎంతో ఆలస్యంగా నియమించింది. పూర్తి స్థాయి రెరా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయలేదు. అనేమంది కొత్త వ్యక్తులు ఈ రంగంలోకి వచ్చి ప్రీలాంచుల్లో విక్రయిస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరించేది. ప్రీలాంచ్ ప్రమోటర్లకు టీఎస్ రెరా అథారిటీ.. ఎంచక్కా రెరా అనుమతిని కూడా మంజూరు చేసేది. దీంతో, ప్రీలాంచ్ చేయకపోవడమో నేరమని భావించేలా కొందరు బిల్డర్లు తయ్యారయ్యారు. అంతెందుకు, బడా ఆఫీసర్లకే ప్రీలాంచులు చేయడం నేరమనే విషయం తెలియదు. ఏదీఏమైనా, భువనతేజ చక్కా వెంకటసుబ్రమణ్యంను అరెస్టు చేయడంతో.. ప్రీలాంచ్ ఆపరేటర్లకు కొంతలో కొంతయినా అడ్డుకట్ట పడుతుందని రియల్ వర్గాలు అంటున్నాయి.