కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావల్సిన గ్రాంటు రూ.1800 కోట్లు వెంటనే విడుదలయ్యేలా సహకరించాలని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ భేరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్‌ను కలిసిన ఆయన.. హైదరాబాద్‌లో మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు ఇప్పించాలని కోరారు. ఇందుకు అవసరమైన ప్రపంచబ్యాంకు ఎయిడ్ విడుదలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాగు నీటి సరఫరాకు అవసరమైన నిధులతో పాటు రాష్ట్రంలో తమ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్కరణలకు మద్దతు ఇవ్వాలని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్‌కు సీఎం విజ్ఙప్తి చేశారు.