- రెరా నిబంధనల ప్రకారం..
- ప్రాజెక్టు విలువలో 10శాతం జరిమానా విధించాలి
- ఇమాజిన్ సేల్ ప్రైస్ ప్రకారం.. ఈ
ప్రాజెక్టు విలువ.. రూ.622 కోట్లు - దీనిపై పది శాతం జరిమానా విధించాలి!
ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో.. మొయినాబాద్ మండలంలోని బాకారంలో.. ఇమాజిన్ విల్లాల్ని నిర్మిస్తోన్న డ్రీమ్ వ్యాలీ సంస్థ బాగోతం ఒక్కొక్కటిగా బయటికొస్తుంది. రెండు ఫేజుల్లో డెవలప్ చేస్తున్న ఈ విల్లాల్ని ఇప్పటికే మొదటి ఫేజులో 13 విల్లాల్ని విక్రయించగా.. రెండో ఫేజులోని పంతొమ్మిది విల్లాల్లో.. దాదాపు పది విల్లాల్ని అమ్మేసినట్లు సమాచారం. డ్రీమ్ వ్యాలీ ఇమాజిన్ విల్లాలపై కథనాన్ని రియల్ ఎస్టేట్ గురు తొలుత ప్రచురించిన తర్వాత.. టీఎస్ రెరా అథారిటీ ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమైంది. ఈ మేరకు డ్రీమ్ వ్యాలీ సంస్థకు టీఎస్ రెరా నోటీసుల్ని జారీ చేసే పనిలో నిమగ్నమైంది. మరి, ఎప్పటిలాగే టీఎస్ రెరా నోటీసులిచ్చి చేతులు దులిపేసుకుంటుందా? లేకపోతే, డ్రీమ్ వ్యాలీ ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానా విధిస్తుందా? అనే విషయం త్వరలో తేలుతుంది.
ఇమాజిన్‌పై ఎంత జరిమానా?
డ్రీమ్ వ్యాలీ సంస్థ ఇమాజిన్ విల్లాస్‌లో ఒక్కో విల్లాను పదిహేను వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తోంది. చదరపు అడుక్కీ రూ.15,000 చొప్పున విక్రయిస్తుందని ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్‌లే చెప్పారు. అంటే, మొదటి ఫేజులో పదమూడు విల్లాల్ని చదరపు అడుక్కీ రూ.10 వేల చొప్పున విక్రయించినా.. తుది రేటు రూ.15 కోట్ల దాకా అవుతుంది. అంటే, మొదటి ఫేజు 13 విల్లాల విలువ.. సుమారు రూ. 195 కోట్ల దాకా ఉంటుంది. రెండో ఫేజు విల్లాల్ని చదరపు అడుక్కీ రూ.15 వేల చొప్పున 19 విల్లాల్ని అమ్మకానికి పెట్టింది. అంటే, ఒక్కో విల్లా విలువ రూ.22.5 కోట్లు కాగా మొత్తం విలువ 427.50 కోట్ల దాకా ఉంటుంది. అంటే, ప్రాజెక్టు విలువ ఎంతలేదన్నా రూ.622 కోట్ల దాకా ఉంటుంది చెప్పొచ్చు. దీనిపై పది శాతం అంటే..
ఒక్క ఇమాజిన్ విల్లాస్ నుంచి సుమారు రూ.62 కోట్ల జరిమానాను విధించడానికి అవకాశముంది. ఈ ఒక్క ప్రాజెక్టు నుంచే ఇంత భారీ స్థాయిలో రెరా జరిమానా వసూలు చేస్తే.. మొత్తం ట్రిపుల్ వన్ జీవోలో నిర్మిస్తున్న అక్రమ విల్లాల నుంచి ఎంత మేరకు జరిమానాను వసూలు చేయడానికి అవకాశముందో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.