- పోలీసులు, ప్రభుత్వానికి
భువనతేజ బాధితుల విజ్ఞప్తి
ప్రీలాంచుల పేరిట కొనుగోలుదారుల నుంచి కోట్ల రూపాయల్ని దండుకున్న భువనతేజ ఇన్‌ఫ్రాకు చెందిన ఇద్దరు కీలక సభ్యుల్ని సీసీఎస్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఫణిభూషణ్‌రావు, రాజ్‌కుమార్‌లు అటు ప్రాజెక్టును కట్టకుండా ఇటు ప్రజల డబ్బులు వెనక్కి ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నారనే ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే కీలక సూత్రధారి అయిన చక్కా వెంకటసుబ్రమణ్యంను నెల రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. సుమారు 300 మంది ప్రజల్నుంచి దాదాపు ఎనభై కోట్లను వీరు ప్రీలాంచుల పేరిట వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
భువనతేజ సంస్థకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు సరే.. కానీ, తమ సొమ్ము వెనక్కి ఎప్పుడొస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరెస్టు చేసి రిమాండ్ పంపించగానే.. బయటికొచ్చి మళ్లీ దర్జాగా తిరుగుతారని.. పేరు మార్చి మరో ఇతర చోట ఇలాంటి ప్రీలాంచ్ మోసాలకు పాల్పడరని గ్యారెంటీ ఏముందని అంటున్నారు. కొద్ది రోజులు జైలులో ఊచలు లెక్కపెట్టాక బయటికొచ్చాక విదేశాలకు పారిపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో ఏ రియల్టర్ ఇలాంటి ప్రీలాంచ్ మోసాలకు పాల్పడకుండా పోలీసులు కఠిన చర్యల్ని తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ముఖ్యమంత్రి మీదే భారం!
భువనతేజ బాధితులకు న్యాయం జరగాలంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే, గత ఐదేళ్లలో తెలంగాణలో ప్రీలాంచ్ మోసాలు ఎక్కువైన విషయం తెలిసిందే. సాహితీ, జయా గ్రూప్, భువనతేజ వంటి సంస్థల జాబితాలో పలు కంపెనీలు చేరే అవకాశముంది. ఇళ్లకు సంబంధించిన ఆర్థిక నేరాల్ని దర్యాప్తు చేసేందుకు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశక్యత ఎంతైనా ఉంది.
భువనతేజతో పాటు సాహితీ, జయ, జీఎస్సార్ వంటి వెంచర్లలో ఫ్లాట్లు కొని మోసపోయినవారు.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా గళమిప్పే అవకాశం లేకపోలేదు. అలా జరగకూడదంటే.. ప్రభుత్వమే బాధితులకు అండగా నిలవాలి. వారి సొమ్మును వెనక్కి ఇప్పించాలి. లేక ఫ్లాట్లనైనా కట్టించి ఇవ్వాలి. ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. అమాయక మధ్యతరగతి ప్రజలు మొత్తం నిండా మునిగిపోయే ప్రమాదముంది.