స్కై విల్లాస్.. వినడానికి ఆకాశాన్నంటే విల్లాస్ అనిపిస్తోంది కదూ! కాకపోతే, ఇవి ఆకాశాన్నంటే మేఘాలతో సయ్యాట ఆడేందుకు వీలుండే అపార్టుమెంట్లు అన్నమాట. ఇవి చూసేందుకు విల్లా తరహాలో ఎక్కువ విస్తీర్ణంలో ఉంటాయి. కొన్ని ప్రాజెక్టుల్లో ఒక అంతస్తులో.. మరికొన్నింట్లో రెండు అంతస్తుల్లో.. ఆకాశాన్నంటే ఎత్తులో దర్శనమిస్తాయి. అందుకే, వీటిని స్కైవిల్లాస్ అని పిలుస్తున్నారు. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. హైదరాబాద్‌లో ఎక్కడ ఆరంభమైనా.. వీటిని కొనుగోలు చేసేందుకు అధిక శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. మరి, వీటిని ఎవరెవరు ఎక్కడెక్కడ నిర్మిస్తున్నారో తెలుసా?
హైదరాబాద్‌లో ప్రప్రథమంగా స్కై విల్లాస్ కాన్సెప్టుకు లోధా గ్రూప్ శ్రీకారం చుట్టింది. 2013లో ఈ సంస్థ కేపీహెచ్‌బీ కాలనీలో లోధా బెల్లెజా ఆకాశహర్మ్యాన్ని ఆరంభించింది. అప్పట్లో ఫ్లోరుకొక ఫ్లాటంటే అందరూ ఆశ్చర్యపోయారు. కేవలం కొద్దిమందికి మాత్రమే ఆయా ఫ్లాట్లను లోధా విక్రయించింది. ఇక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, స్కై విల్లాస్ కాన్సెప్టుకు అధిక ఆదరణ లభించింది. కోకాపేట్లో శ్రీ శ్రీనివాసా కన్స్ట్రక్షన్స్ సంస్థ ఫార్చ్యూన్ స్కైవిల్లాస్ అంటూ క్రేజీ ప్రాజెక్టును ప్రారంభించింది. ఆ ప్రాజెక్టును ఆరంభించిందో లేదో హాట్ కేకులా ఫ్లాట్లను విక్రయించింది. దీంతో, పలు ఇతర సంస్థలూ అధిక విస్తీర్ణంలో ఫ్లాట్లను డిజైన్ చేయడం ఆరంభించారు.
వాసవి గ్రూప్..
నగరానికి చెందిన వాసవి గ్రూప్ ఆరంభించిన పలు ఆకాశహర్మ్యాల్లో స్కై విల్లా కాన్సెప్టుకు శ్రీకారం చుట్టింది. ఎల్బీనగర్లో వాసవి ఆనంద నిలయం, ఉప్పల్‌లో వాసవి క్రౌన్ ఈస్ట్, కొండాపూర్‌లో వాసవి స్కైలా, నార్సింగిలో వాసవి అట్లాంటిస్ వంటి ప్రాజెక్టుల్లో స్కై విల్లాస్‌కు స్థానం కల్పించింది. వీటిలో అధిక శాతం ఇప్పటికే అమ్ముడయ్యాయని సంస్థ చెబుతోంది.
కొల్లూరులో ఇవానా
కొల్లూరులో అన్వితా గ్రూప్ ఇవానా అనే ప్రాజెక్టును ఆరంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో స్కైవిల్లాస్కు పెద్దపీట వేసింది. పద్నాలుగు మరియు పదిహేనో అంతస్తులో.. దాదాపు ముప్పయ్ ఊబర్ లగ్జరీ స్కై విల్లాలను డిజైన్ చేసింది. ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్లతో పాటు హోమ్ థియేటర్‌ను కూడా ఇందులో డిజైన్ చేశారు. టెర్రస్లోనూ ఇళ్ల కొనుగోలుదారులు సరికొత్త జీవితాన్ని ఆస్వాదించే రీతిలో ముస్తాబు చేస్తోంది. ఈ ప్రాంతాన్ని ఒక ప్లే గ్రౌండ్ అన్నట్లుగా డెవలప్ చేస్తుంది. టెర్రస్‌లో ఆకర్షణీయమైన రీతిలో ల్యాండ్ స్కేపులను, సీటింగ్ ఏరియాలను తీర్చిదిద్దుతోంది.