సొంతిల్లు అనేది ఎవరికైనా ఉండే అతిపెద్ద కల. కష్టపడి పైసా పైసా కూడబెట్టి, మరికొంత రుణం తీసుకుని 15 నుంచి 25 ఏళ్లపాటు దాని ఈఎంఐలు చెల్లిస్తూ.. ఆ కల నెరవేర్చుకుంటారు. ఇంటి రుణం తీసుకోకుండా ఇల్లు కొనడం అనేది దాదాపు అసాధ్యమే. పైగా అంతకంతకూ ఇటు ఇళ్ల ధరలు.. అటు వడ్డీ రేట్లు.. రెండూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇల్లు కొనేముందు చాలా అంశాలు చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రుణం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం ఎంత? ఖర్చులు ఎంత? మిగిలేది ఎంత? ఇవన్నీ లెక్కలు వేసుకోవాలి. వచ్చే ఆదాయం కనీసం 30 శాతం మిగులు ఉంటేనే ఇంటి కొనుగోలుకు రుణం తీసుకునే ఆలోచన చేయాలి. లేకుంటే ఇంటి కొనుగోలును వాయిదా వేయడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇల్లు కొనేముందు చేతిలో ఎంత డబ్బు ఉందో చూసుకోవాలి. ఎందుకంటే ఇంటి ధర మొత్తాన్ని రుణం కింద ఏ బ్యాంకులూ ఇవ్వవు. కొంత మొత్తం డౌన్ పేమెంట్ కింద చెల్లించాల్సిందే. ప్రాపర్టీ ధరలో కనీసం 10 నుంచి 20 శాతం వరకు డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. రుణాలిచ్చే బ్యాంకులు, ఆర్థిక సంస్థలను బట్టి ఇందులో మార్పులు ఉంటాయి. డౌన్ పేమెంట్ ఎంత ఎక్కువ చెల్లిస్తే రుణభారం అంతగా తగ్గుతుంది. అలాగే తీసుకున్న రుణానికి సంబంధించిన ఈఎంలు క్రమం తప్పకుండా చెల్లించక తప్పదు. ఇది కనీసం 180 నెలలపైనే ఉంటుంది. ఈలోగా వడ్డీ రేట్లు పెరిగితే మరికొన్ని నెలలు పెరుగుతాయి. అందువల్ల భవిష్యత్తులో పెరిగే ఖర్చులు, ఈఎంఐ చెల్లింపులు ఇవన్నీ వచ్చే ఆదాయంతో సరిపోతాయా లేదా అనేది కచ్చితంగా లెక్కించుకోవాలి. ఏ కారణం చేతనైనా ఈఎంఐ చెల్లింపు చేయకపోతే క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. అలా జరిగితే భవిష్యత్తు రుణాలపై ప్రభావం పడుతుంది. క్రెడిట్ స్కోరు బాగుంటే వడ్డీ రాయితీ లభిస్తుంది. అందువల్ల ఈ అంశాలన్నీ పరిశీలించుకున్న తర్వాతే ఇంటి కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.