బిల్డాక్స్ స్కామ్‌ను ప్రప్రథమంగా
వెలుగులోకి తెచ్చిన రెజ్ న్యూస్
బిల్డాక్స్ సంస్థ డైరెక్టర్.. కాళేశ్వర్ వాస్గీ
హఫీజ్‌పేట్ సర్వే నెం 80లో
అనుమతుల్లేకుండా ఫ్లాట్ల అమ్మకం
ఫేస్‌బుక్, సోషల్ మీడియాలో ప్రచారం
తెలంగాణ రెరా అథారిటీ ఇటీవల కీలక తీర్పునిచ్చింది. హఫీజ్‌పేట్ సర్వే నెం. 80లో.. ప్రీలాంచ్ అమ్మకాలు జరుపుతున్న బిల్డాక్స్ సంస్థపై రూ.3.96 కోట్ల జరిమానాను విధించింది. ఈ మేరకు గురువారం తుది విచారణ జరిపిన అనంతరం తాజా తీర్పును వెలువరించింది. ఈ వ్యవహారాన్ని మొట్టమొదట రెజ్‌న్యూస్ వెలుగులోకి తెచ్చింది.
బిల్డాక్స్ ప్రీలాంచ్ వ్యవహారం గురించి రెజ్ న్యూస్ పేపర్‌లో వచ్చిన కథనం ఆధారంగా టీఎస్ రెరా అథారిటీ సదరు సంస్థకు నోటీసును జారీ చేసింది. ఇందుకు గాను బిల్డాక్స్ సమాధానమిస్తూ.. హఫీజ్‌పేట్ సర్వే నెంబర్ 80లో తమకెలాంటి ల్యాండ్ పార్శిళ్లు లేవని, ప్రాజెక్టు చేయడానికి డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఎవరితోనూ కుదుర్చుకోలేదని అన్నారు. అభివృద్ధి చెందడానికి ఆస్కారమున్న హైదరాబాద్‌లో మార్కెటింగ్ చేసుకోవడానికి వీలున్న ప్రాంతాల్లో స్థలాల్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని బిల్డాక్స్ తొలుత సమాధానమిచ్చింది. తాము ఎలాంటి ప్రకటనను విడుదల చేయలేదని తెలియజేసింది.
బిల్డాక్స్ సమాధానంతో సంతృప్తి చెందని టీఎస్ రెరా రెండోసారి నోటీసును జారీ చేసింది. హఫీజ్‌పేట్ సర్వే నెంబర్ 80లో గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టును కడుతున్నామంటూ ఫ్లాట్లను అమ్మినట్లు సాక్ష్యాధారాలు ఉన్నట్లు అందులో పేర్కొంది. తర్వాత బిల్డాక్స్‌లో ఫ్లాట్లను కొనకూడదని టీఎస్ రెరా అథారిటీ ప్రకటనను విడుదల చేసింది. 2024 ఫ్రిబవరి 10న శరత్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో ఒక యాడ్ చూసి క్లిక్ చేస్తే.. బిల్డాక్స్ సేల్స్ టీమ్ లోని కమల్ టచ్‌లోకి వచ్చి హఫీజ్‌పేట్ సర్వే నెం 80లో కడుతున్న ప్రాజెక్టు వివరాలన్నీ అందజేశారని రెరా పేర్కొంది. ఆతర్వాత అతను దేవెందర్ అనే బిల్డాక్స్ డైరెక్టర్‌కు ఫ్లాట్ నిమిత్తం రెండు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అయితే, ఆతర్వాత ఆయా ప్రాజెక్టుకు రెరా అనుమతి లేదని తెలుసుకుని అతను రెరాకు ఫిర్యాదు చేశారు. బిల్డాక్స్ తెలివిగా తమ పేరు మీద ఎవరో ఇలా చేస్తున్నారని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ.. ఫేస్ బుక్‌కు ఫిర్యాదు చేశామని రెరాకు సమాధానమిచ్చింది. కాకపోతే, ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేసినట్లు ఎక్కడా ఆధారం చూపించలేదు.
బిల్డాక్స్ జారీ చేసిన ప్రీలాంచ్ ప్రకటన ఫేస్‌బుక్‌లో ఇంకా కొనసాగుతున్నందు వల్ల.. ప్రజలకు తప్పుడు సమాచారాన్ని చేరవేస్తోందని రెరా గమనించింది. కొనుగోలుదారుల నుంచి నగదు వసూళ్లకు పాల్పడుతున్నదని గ్రహించిన టీఎస్ రెరా అథారిటీ.. టీఎస్ రెరా చట్టంలోని 59, 60 సెక్షన్ల ప్రకారం.. అపరాధ రుసుమును విధించింది. బిల్డాక్స్ తరఫున న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయడానికి మూడు వారాల సమయం కావాలని కోరారు. కాకపోతే, బిల్డాక్స్ ప్రకటనలు ఫేస్‌బుక్‌లో ఇంకా కొనసాగుతున్న అంశాన్ని పరిగణలోకి తీసుకున్న రెరా అథారిటీ.. కొనుగోలుదారులు మోసానికి గురికాకుండా ఉండేందుకు అపరాధ రుసుమును విధించినట్లు టీఎస్ రెరా అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. బిల్డాక్స్ ప్రాజెక్టు విషయంలో ఎలాంటి ప్రకటనలు, మార్కెటింగ్, విక్రయాలు కొనసాగించకూడదని టీఎస్ రెరా అథారిటీ బిల్డాక్స్‌కు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఫేస్ బుక్ ప్రకటనలు వెంటనే తొలగించాలని రెరా ట్రిబ్యునల్ బిల్డాక్సు ను ఆదేశించింది.