20 సంస్థలకిచ్చిన నోటీసులు ఏమయ్యాయి?
కేశినేని డెవలపర్స్ నుంచి వసూలెంత చేశారు?
ఇమాజిన్ విల్లాస్‌పై జరిమానా ఎప్పుడు?
సైబర్‌సిటీ, ఇన్‌కార్ లపై చర్యల్లేవా?
టీఎస్ రెరా అంటే హైదరాబాద్ బిల్డర్లకు పెద్దగా భయం లేదు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో నామ్‌కే వాస్తే అన్నట్లుగా ఈ సంస్థను ఏర్పాటు చేసింది. అప్పటి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సూచన మేరకు.. తప్పదన్నట్లుగా మాసాబ్ ట్యాంకులో కార్యాలయాన్ని సిద్ధం చేసింది. అప్పట్లో సీనియర్ ఐఏఎస్ అధికారి రాజేశ్వర్ తివారీ ఉన్నంత వరకూ టీఎస్ రెరా పని తీరు ఫర్వాలేదనిపించింది. కాకపోతే, ఆతర్వాతే గాడి తప్పింది.
చదరపు అడుక్కీ, గజానికి తేడా తెలియని బఫూన్లు నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ఎక్కడపడితే అక్కడ భూముల్ని తీసుకుని.. అడ్వాన్సులు చెల్లించి ప్రీలాంచ్ దందాకు శ్రీకారం చుట్టారు. అందులో కొన్నవారు నేటికీ గోస పడుతూనే ఉన్నారు. మరి, ప్రీలాంచుల్ని చేయకుండా నియంత్రించడంలో టీఎస్ రెరా ఎందుకు విఫలమైంది? టీఎస్ రెరా అంటే బిల్డర్లకు ఎందుకు భయం లేకుండా పోయింది?
టీఎస్ రెరాకు ఛైర్మన్‌గా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఉన్నంత కాలం రెరాపై పెద్దగా దృష్టి సారించలేదు. ఫలితంగా ప్రీలాంచుల దందా హైదరాబాద్ రియల్ మార్కెట్‌ను పూర్తిగా కలుషితం చేసింది. విస్తుగొలిపే విషయం ఏమిటంటే.. కోకాపేట్ వేలం పాటల్లో భూముల్ని దక్కించుకున్న బిల్డర్లు ప్రీలాంచులు చేసి సొమ్మును హెచ్ఎండీఏకు కట్టేవారు. అందుకు ప్రభుత్వమూ అభ్యంతరం చెప్పకపోవడంతో.. అనేకమంది బిల్డర్లు ప్రీలాంచుల్ని చేయడం ఆరంభించారు. అసలు ప్రీలాంచ్ చేయకపోతే బిల్డరే కాదనే పరిస్థితి.. బీఆర్ఎస్ ఉన్నంత వరకూ మార్కెట్లో ఏర్పడింది. కాకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా.. పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదనే చెప్పాలి. ఎందుకో తెలుసా? ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని రెరా ఛైర్మన్‌గా నియమించడమే ఇందుకు ప్రధాన కారణం. అప్పుడే ఒక యంగ్ ఆఫీసర్‌ని నియమించి ఉంటే.. హైదరాబాద్‌లో ఔత్సాహిక ఇళ్ల కొనుగోలుదారులకు కొంత భరోసా కలిగేది. ప్రీలాంచులకు అడ్డుకట్ట పడేది.
17.50 కోట్ల జరిమానా ఏమైంది?
ప్రీలాంచుల్లో బయ్యర్లు మోసపోయాక.. తమకొచ్చి ఫిర్యాదు చేస్తేనే.. పని చేస్తామనే రీతిలో టీఎస్ రెరా ఛైర్మన్ వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రీలాంచులు, ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరిట కొన్ని నిర్మాణ సంస్థలు కోట్ల రూపాయల్ని దండుకున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పత్రికల్లో వచ్చే కొన్ని కథనాలకు స్పందించి.. ఆయా సంస్థలకు నోటీసులిచ్చి చేతులు దులిపేసుకుంటున్నారే తప్ప.. బిల్డర్ల నుంచి ముక్కు పిండి జరిమానాను వసూలు చేస్తున్న దాఖలాలు కనిపించట్లేదు. బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ గ్రూప్.. కేవలం హైదరాబాద్‌లో మాత్రమే ప్రీలాంచ్ దందాను నడుపుతోంది. గత ఐదేళ్లుగా ఈవోఐ పేరిట ఎన్ని వందల ఫ్లాట్లను విక్రయించినా.. టీఎస్ రెరా చూసీ చూడనట్లు వ్యవహరించిందే తప్ప.. జరిమానాను వసూలు చేయలేదు. కేశినేని డెవలపర్స్, సాహితీ, మంత్రి డెవలపర్స్, సాయి సూర్య డెవలపర్స్ వంటి కంపెనీలపై దాదాపు రూ.17.50 కోట్ల జరిమానాను గతంలో విధించామని ప్రకటించింది. కానీ, అందులో ఎంత మొత్తాన్ని జరిమానాగా వసూలు చేసిందో ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
బిల్డర్లతో దోస్తీ?
టీఎస్ రెరా ఛైర్మన్‌కు పలు నిర్మాణ సంఘాలతో మంచి దోస్తి కుదరడం వల్లే.. ప్రీలాంచ్ బిల్డర్లపై పెద్దగా చర్యలు తీసుకోవట్లేదనే విమర్శలున్నాయి. క్రెడాయ్ హైదరాబాద్‌కు చెందిన సైబర్‌సిటీ డెవలపర్స్, ఇన్‌కార్ గ్రూప్ వంటివి ప్రీలాంచులు చేస్తున్నాయని తెలిసినా.. ఆయా కంపెనీలపై ఇంతవరకూ ఎలాంటి చర్యల్ని తీసుకోలేదు. ట్రిపుల్ వన్ జీవో ప్రాంతమైన బాకారంలో.. డ్రీమ్ వ్యాలీ సంస్థ అక్రమంగా ఇమాజిన్ విల్లాస్ ను నిర్మిస్తున్నా.. ఇప్పటివరకూ కనీసం నోటీసూ ఇవ్వలేదు. నిషేధిత ప్రాంతంలో డ్రీమ్ వ్యాలీ విల్లాల్ని నిర్మిస్తోందని బాకారం పంచాయతీ కార్యదర్శి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసినప్పటికీ.. టీఎస్ రెరా స్పందించలేదు. ప్రభుత్వం నిషేధించిన భూమిలో.. టీఎస్ రెరా అనుమతి లేకుండా.. ఒక డెవలపర్ అక్రమంగా విల్లాల్ని నిర్మిస్తుంటే.. రెరా ఛైర్మన్ డా సత్యనారాయణ చోద్యం చూస్తున్నారా అంటూ రెరా బిల్డర్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాగైతే అక్రమ నిర్మాణాలకు, రెరా కట్టడాలకు మాత్రం తేడా ఏముంటుందని నిలదీస్తున్నారు. కాబట్టి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన డా.ఎన్ సత్యనారాయణ ఇప్పటికైనా ప్రీలాంచ్ బిల్డర్లను దారిలోకి తేవాలి.