హైదరాబాద్ రియాల్టీలో ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని కొందరు గోబెల్స్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని తేలింది. ఇదే విషయాన్ని కనుక్కోవడానికి ఇటీవల రియల్ ఎస్టేట్ గురు.. అనుమతులకు దరఖాస్తు చేసుకున్న పలువురు బిల్డర్లను సంప్రదించింది. అయితే తాము, ఆర్ ట్యాక్స్ గురించి ఎక్కడా వినలేదన్నారు. ఏ అధికారి కూడా ఏ దశలోనూ ఆర్ ట్యాక్స్ గురించి అడగలేదన్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో బిల్డర్లు ఎవరైనా ఆర్ ట్యాక్స్ చెల్లించారా? అని ఆరా తీయగా.. అసలలాంటి ట్యాక్స్ గురించి ఎవరూ చెప్పలేదన్నారు. మొత్తానికి, కేవలం హైదరాబాద్ రియల్ రంగాన్ని దెబ్బతీయడానికే కొందరు ఇలాంటి అసత్య ప్రచారాల్ని నిర్వహిస్తున్నారని తెలిసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. డిసెంబరు నుంచి అనుమతులు విడుదల కాకపోవడంతో.. హైదరాబాద్ బిల్డర్లు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. అయితే, ఆర్ ట్యాక్స్ ను తెలంగాణ రాష్ట్రంలో వసూలు చేస్తున్నారని స్వయంగా పీఎం మోడీ ప్రకటించడంతో రియల్ రంగం మొదట్లో షాక్‌కు గురైంది. అందులో ఎంతమాత్రం నిజముందో తెలియదు కానీ.. మార్కెట్లో అయితే ఆర్ ఆర్ ట్యాక్స్ గురించి చర్చలైతే మొదలయ్యాయి. ఇదే విషయాన్ని తెలుసుకునేందుకు రియల్ ఎస్టేట్ గురు పలువురు బిల్డర్లతో మాట్లాడింది. తాము ఆర్ ట్యాక్స్ గురించి ఎక్కడా వినలేదని.. ఎవరూ అడగలేదని జవాబిచ్చారు. అసలే అధికారీ ఇలా ఆర్ ట్యాక్స్ అని ప్రత్యేకంగా అడిగిన దాఖలాల్లేవని తెలిపారు. కాకపోతే, హైదరాబాద్ పరిధిలో కలెక్టర్ దొరక్కపోవడంతో ప్రాజెక్టులకు అనుమతులు ఆలస్యం అవుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. హైరైజ్ నిర్మాణాలకు అనుమతులు ఆలస్యం కాకుండా ప్రభుత్వం పటిష్ఠమైన చర్యల్ని తీసుకోవాలని రియల్టర్లు కోరుతున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు గెలిచిందో అంటూ కొందరు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ఇన్వెస్టర్లు, ప్రవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకంటే ముందు మంచి ఊపులో ఉన్న రియల్ రంగం ఆతర్వాత ఒక్కసారిగా మందికోడిగా మారింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్కసారిగా మెట్రో రైలు బంద్ అనేసరికి పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్లు ఆశ్చర్యపోయారు. వేచి చూసే ధోరణీని అలవర్చుకున్నారు. డిసెంబరు నుంచి మార్చి వరకూ హైదరాబాద్ రియల్ రంగాన్ని గాడిలో పెట్టేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చాలామంది వేచి చూశారు. కానీ, రియల్ మార్కెట్ డెవలప్ చేసేలా ఎలాంటి ప్రోత్సాహం లభించకపోవడంతో వెనకడుగు వేశారు. ఈలోపు ఏప్రిల్ నుంచి ఎన్నికల హడావిడి ఆరంభం కావడంతో.. ప్రజలు ఇళ్లను కొనడాన్ని మర్చిపోయి.. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అనే అంశంపై ప్రధానంగా చూస్తున్నారు. అయితే, డిసెంబరు నుంచి మే వరకూ ప్రవాసులు హైదరాబాద్ మీద అసలేమాత్రం దృష్టి పెట్టకపోవడం గమనార్హం. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. ప్రతి అంశాన్ని పక్కగా బేరీజు వేసుకుని.. కాస్త టైమ్ తీసుకుని నిర్ణయాల్ని తీసుకుంటే.. హైదరాబాద్ రియాల్టీ మార్కెట్లో ఇలాంటి గడ్డు పరిస్థితులు ఉండేవి కాదని రియల్ నిపుణులు అంటున్నారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉండే ప్రభుత్వం కాస్త నింపాదిగా నిర్ణయాల్ని తీసుకుంటే మెరుగ్గా ఉండేదని చెబుతున్నారు.