- 69 నుంచి 72కి పెరిగిన స్కోర్
- 73కి ఎగబాకిన డెవలపర్
ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోర్ - నైట్ ఫ్రాంక్-నరెడ్కో నివేదికలో వెల్లడి
దేశంలో రియల్ ఎస్టేట్ రంగం అద్భుతమైన పురోగతి దిశగా పయనిస్తోంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ సెంటిమెంట్ స్కోర్ దశాబ్దకాలం గరిష్టానికి చేరుకుంది. ఇది గత త్రైమాసికంలో 69గా ఉండగా.. ఈ ఏడాది క్యూ1లో 72కి ఎగబాకింది. గత పదేళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. అలాగే డెవలపర్ ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోర్ కూడా పెరిగింది. 2023 క్యూ4లో ఇది 70 ఉండగా.. 2024 క్యూ1లో 73కి చేరింది. స్థిరంగా ఉన్న మన ఆర్థిక వ్యవస్థ, కరోనా తర్వాత గాడిలో పడిన పరిస్థితులు, పెరిగిన లావాదేవీ పరిమాణాలు కలిసి భారత రియల్ రంగంలో అధిక డిమాండ్ కు కారణమయ్యాయి. ఈ మేరకు నైట్ ఫ్రాంక్-నరెడ్కో సంయుక్తంగా రూపొందించిన నివేదికలో వెల్లడైంది.
రెసిడెన్షియల్ యూనిట్ల అమ్మకాలు, ఆఫీస్ లావాదేవీ పరిమాణాలు 9 శాతం పెరిగాయని తేలింది. వార్షిక ప్రాతిపదికన ఇందులో 43 శాతం పెరుగుదల నమోదైంది. 2024 క్యూ1లో రెసిడెన్షియల్ మార్కెట్ చాలా ఆశాజనకంగా ఉందని.. ఈ నేపథ్యంలో ఇళ్ల ధరలు పెరుగుతాయని ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో 82 శాతం మంది అభిప్రాయపడ్డారు. అలాగే ఆఫీస్ మార్కెట్ జోరుగా కొనసాగుతోందని.. వచ్చే ఆరు నెలల్లో లీజింగ్, సరఫరా, అద్దెలపై ఆశావహ దృక్పథంలో ఉన్నామని పేర్కొన్నారు. సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే కొనుగోలుదారుల బలమైన సెంటిమెంట్ తోపాటు దాదాపు ఏడాది పాటు రెపో రేటుపై రిజర్వు బ్యాంకు స్థిరమైన విధానం ఈ రంగం వృద్ధికి దోహదం చేసింది.
మరోవైపు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ లు కలిగి ఉన్న నాన్ డెవలపర్ ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోర్ స్థిరంగా ఉంది. 2023 క్యూ4, 2024 క్యూ1లో 73 వద్దే కొనసాగుతోంది. సంస్థాగత పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండే వైఖరిని కొనసాగించినప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థపై వారి విశ్వాసం గణనీయంగానే ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ కాలంలో మరింత పెరిగింది.
రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్ రియల్ ఎస్టేట్ రంగానికి ఓ ఉత్తేజకరమైన దృక్పథాన్ని చూపిస్తుందని.. ప్రస్తుతం సెంటిమెంట్ ఇండెక్స్, ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోర్ పెరగడం మనదేశ రియల్ రంగ స్థిరత్వానికి నిదర్శనమని నరెడ్కో అధ్యక్షుడు హరిబాబు పేర్కొన్నారు. సెంటిమెంట్ ఇండెక్స్ స్కోర్ పెరగడానికి మనదేశ బలమైన ఆర్థిక వ్యవస్థే కారణమని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ అభిప్రాయపడ్డారు.