- రోజురోజుకూ తగ్గిపోతున్న అందుబాటు ధరల ఇళ్లు
- కరోనా తర్వాత విశాలమైన ఇళ్లకే జనం మొగ్గు
- భూముల ధరలు, నిర్మాణ వ్యయం పెరగడం మరో కారణం
దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతోంది. భూముల ధరల దగ్గర నుంచి ఇళ్ల రేట్ల వరకు గణనీయంగా పెరుగుతూనే ఉన్నా.. డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంటోంది. అయితే, అందుబాటు ధరల (రూ.40 లక్షల కంటే తక్కువ) ఇళ్ల విషయంలో మాత్రం ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రియల్ ఎస్టేట్ రంగ పురోగతికి వ్యతిరేకంగా ఈ విభాగం తిరోగమనం వైపు పయనిస్తోంది. రోజురోజుకూ ఈ ఇళ్ల సరఫరా, అమ్మకాలు తగ్గుతున్నాయి. హైదరాబాద్ సహా దేశంలోని ఏడు నగరాల్లో ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత ఐదేళ్లుగా అందుబాటు ధరల ఇళ్ల అమ్మకాలు, సరఫరా తగ్గుతూ వస్తోంది. ఈ కాలంలో మొత్తం ప్రాపర్టీ రంగం మంచి పనితీరు కనబరిచినప్పటికీ, బడ్జెట్ హోమ్స్ మాత్రం వెనకబడ్డాయి. 2019 నుంచి 2023 మధ్య కాలంలో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కానీ అందుబాటు ధరల ఇళ్లు అమ్మకాలు 38 శాతం నుంచి 19 శాతానికి తగ్గాయి. 2024 జనవరి-మార్చి త్రైమాసికంలో ఇవి 20 శాతంలోపే ఉన్నాయి. అమ్మకాలే కాకుండా సరఫరా సైతం తగ్గిపోయింది. 2019 నుంచి 2023 మధ్య కాలంలో బడ్జెట్ ఇళ్ల లాంచింగులు 40 శాతం నుంచి 18 శాతానికి పడిపోయాయి. ముఖ్యంగా కరోనా తర్వాతే ఈ పరిస్థితి మొదలైంది. కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడిన జనం.. విశాలమైన, సౌకర్యవంతమైన ఇళ్ల వైపు మొగ్గు చూపించడమే ఇందుకు కారణం.
లగ్జరీ హౌసింగ్ ఎలా పెరిగింది?
వాస్తవానికి రియల్ ఎస్టేట్ రంగంలో లగ్జరీ ఇళ్లు కీలకంగా ఉంటాయి. కరోనా తర్వాత వీటికి డిమాండ్ పెరగడంతో సరఫరా, అమ్మకాలపరంగా కీలకంగా మారాయి. బ్రాండెడ్ డెవలపర్లు సుపీరియర్ లొకేషన్లలో ఎక్కువ ధరలతో వీటి నిర్మాణం భారీగా చేపట్టారు. దీంతో 2019లో 7 శాతంగా ఉన్న లగ్జరీ ఇళ్ల వాటా 2023కి వచ్చేసరికి 25 శాతానికి పెరిగింది. ఇక ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఇది 21 శాతంగా ఉంది. ఈ ఏడాది ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు సైతం లగ్జరీ సెగ్మెంట్ పైనే ఆసక్తి చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ విభాగంలో ముంబై ముందంజలో ఉంది. అయితే, కోల్ కతాలో మాత్రమే ఈ విషయంలో భిన్నంగా ఉంది. అక్కడ బడ్జెట్ హోమ్స్ కి చక్కని ఆదరణే కొనసాగుతోంది.
బడ్జెట్ ఇళ్లు ఎలా కోలుకుంటాయి?
బడ్జెట్ ఇళ్లకు మళ్లీ పూర్వ వైభవం రావాలంటే ప్రభుత్వ జోక్యం తప్పనిసరి. అందుబాటు ధరల ఇళ్లను ప్రోత్సహించేందుకు తగిన చర్యలు చేపట్టాలి. డెవలపర్లకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. వాస్తవానికి ఇందుకోసం 2015లో క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే, దీనిని 2023లో పునరుద్ధరించలేదు. ఈ పథకం కింద రుణదాతకు రుణంలో రాయితీ లభించేది. ప్రస్తుతం అందుబాటు ధరల ఇళ్లను మళ్లీ ప్రోత్సహించాలంటే అలాంటి పథకం తీసుకురావాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. భూముల ధరలతోపాటు నిర్మాణ వ్యయం కూడా బాగా పెరగడంతో అందుబాటు ధరల ఇళ్లను నిర్మించడం సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో అందుబాటు ధరల ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే భూమిని రాయితీపై ఇవ్వడం ఓ మార్గమని సూచిస్తున్నారు.
ప్రభుత్వం ఏమైనా ప్రతిపాదించిందా?
పట్టణ మధ్యతరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ లో ఓ కొత్త హౌసింగ్ పథకం ప్రకటించింది. కానీ దీనికి సంబంధించి ఎలాంటి వివరాలూ రాలేదు. అలాగే గతేడాది ఆగస్టులో అల్ప, మద్యస్త ఆదాయ వర్గాలకు గృహరుణంపై వడ్డీ రాయితీ పథకాన్ని ప్రకటించారు. అయితే, దీనికి సంబంధించి కూడా పూర్తిస్థాయి విధివిధానాలు ఖరారు కాలేదు.