భారతీ బిల్డర్స్ ప్రీలాంచ్ స్కామ్ ని చూసి.. ఇప్పటికైనా కొనుగోలుదారులు ఒక గుణపాఠం నేర్చుకోవాలి. భారతీ బిల్డర్స్ 2020లో చదరపు అడుక్కీ రెండు వేల లోపే ఫ్లాట్లంటూ సోషల్ మీడియాలో ప్రచారాన్ని నిర్వహించింది. దీంతో అనేక మంది బయ్యర్లు తక్కువలో ఫ్లాటు వస్తుందనగానే.. హండ్రెడ్ పర్సంట్ ఎమౌంట్ పెట్టేసి.. అందులో కొనేశారు. ఏడాదైంది… రెండేళ్లయ్యింది.. మూడేళ్లు అయిపోయింది. చివరి దశలో ఉండాల్సిన ప్రాజెక్టులో కనీసం పునాదులు కూడా పడలేదు.
దీంతో బయ్యర్లంతా లబోదిబోమన్నారు. కొందరైతే ఆవేశంతో ఊగిపోయి భారతీ బిల్డర్స్ యజమానులపై చేయి కూడా చేసుకున్నారని తెలిసింది. మరికొందరు రెచ్చిపోయి సంస్థపై కేసు పెట్టారు. ఫలితంగా, ఈ ప్రీలాంచ్ బాగోతమంతా వెలుగులోకి వచ్చింది. అయితే, ఇదంతా భారతీ బిల్డర్స్ యాజమాన్యం రచించిన స్క్రిప్టులో భాగంగానే జరిగిందనే ప్రచారమూ జరుగుతోంది. ఏదీఏమైనప్పటికీ, ఈ ఉదంతం ద్వారా బయ్యర్లు పలు విషయాల్ని నేర్చుకోవాలి.
భారతి బిల్డర్స్ ఏం చేసిందంటే.. తొలుత పదహారు వందలు, పద్దెనిమిది వందలు.. ఆ తర్వాత రెండు వేల రూపాయలకు ఫ్లాట్లను ప్రీలాంచ్‌లో విక్రయించింది. దీంతో, సుమారు మూడు నుంచి నాలుగు వందల మంది కొనుగోలు చేశారు. కొంపల్లిలో మూడేళ్లయినా ప్రాజెక్టు ఆరంభం కాలేదు. అయితే, బయ్యర్లు కేసు పెట్టి బిల్డర్లు అరెస్టయ్యాక.. ఆయా ప్రాజెక్టులను మరో సంస్థకు అప్పగిస్తున్నారు. ఆ బిల్డర్ కొత్త ప్రతిపాదనను ప్రీలాంచ్‌లో కొన్నవారి మీద ముందు పెట్టాడట.
ఇప్పటికే ప్రీలాంచుల్లో కొన్నవారికి పాత రేటు వర్తించదట. రెరా అనుమతి తీసుకున్నాక.. ఫ్లాట్ ధర చదరపు అడుక్కీ మూడు వేల ఎనిమిది వందలు అవుతుందట. మీరు ఇదివరకే హండ్రెడ్ పర్సంట్ సొమ్ము చెల్లించి ఫ్లాట్ కొన్నా కూడా.. కొత్త రేటు ప్రకారం మీరు అదనంగా సొమ్ము చెల్లించాల్సిందే. ఉదాహరణకు మీరు ఇదివరకే రెండు వేల చొప్పున ఫ్లాట్ కొన్నారనుకోండి.. దీనికి అదనంగా చదరపు అడుక్కీ మరో పద్దెనిమిది వందలను రెరా వచ్చిన నాలుగు నెలల్లోపు చెల్లించాలి.
యాభై శాతమే కట్ట గలిగేవారికి ఫ్లాట్ ధర నాలుగు వేల ఐదు వందలు అవుతుంది. మిగతా సొమ్మును 36 నెలల్లో ప్రాజెక్టు పురోగతిని బట్టి కట్టాలి. కేవలం పాతికశాతమే కట్టగలిగేవారికి 5500 చొప్పున ఫ్లాట్లను కేటాయిస్తారు.
ఒకవేళ, మీరు ఇప్పటికే హండ్రడ్ పర్సంట్ సొమ్మును చెల్లించినప్పటికీ.. మీరు ఎంత శాతం సొమ్ము కడతారనే అంశాన్ని బట్టి, అదనంగా ఎంత కట్టాలో బయ్యర్లకు తెలియజేస్తున్నారు. ఈ లెక్కన ఇందులోని బయ్యర్లు మూడేళ్ల క్రితమే హండ్రడ్ పర్సంట్ సొమ్ము కట్టినా, అదే రేటుకు ఇప్పుడు ఫ్లాట్లు రావట్లేదు. పైగా, అదనంగా కొంత సొమ్ము కట్టమని అంటున్నారు. అప్పుడే ఈ ప్రాజెక్టులో కొనసాగుతారు.
అలా కాకుండా, చెల్లించాల్సిన సొమ్ము మాకు వెనక్కి ఇచ్చేయండని అడిగేవారికీ బయ్యర్లకు ఒక ఆప్షన్‌ను అందజేసింది. ఇప్పటికే ఎనభై శాతం వరకూ చెల్లింపులు చేశారో.. వారికి తక్షణమే సొమ్మును వెనక్కి ఇస్తారట. వంద శాతం కట్టిన వారికి ఆరు నెలల్లోపు 9 శాతం చొప్పున వడ్డీతో సహా ఇస్తారట.
వంద శాతం సొమ్ము కట్టినవారిలో ఎవరైనా ఏడాది వరకూ వేచి చూస్తే.. 12 శాతం వడ్డీని లెక్కించి ఇచ్చేస్తారట. అయితే, ఇవన్నీ రెరా అనుమతి వచ్చిన తర్వాతే అందజేస్తారని సమాచారం. అయితే, భారతీ బిల్డర్స్ నుంచి మరో కొత్త సంస్థకు ప్రాజెక్టును హ్యాండోవర్ చేస్తున్నారు కాబట్టి, మరి ఆ కొత్త బిల్డర్.. ఎన్ని రోజుల్లో ప్రాజెక్టును పూర్తి చేశాడు? ఎలాంటి నాణ్యతతో కడతాడు? సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఎలా.. ఇలాంటి నిబంధనల్నీ ముందే రాసుకోవడం ఎట్టి పరిస్థితిలో మర్చిపోకండి.