రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు జరుగుతున్నాయని.. ప్రతిఒక్కరూ రెరా అనుమతి గల వాటిలోనే కొనుగోలు చేయాలని.. ప్రముఖ నటుడు జగపతిబాబు ముందుకొచ్చి చెప్పిన విషయం తెలిసిందే. ఇంతకీ, ఆయన ఏ సంస్థకు యాడ్ ఫిలిం చేశారని రియల్ ఎస్టేట్ గురు ఆరా తీస్తే.. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కోసం ఆయన యాడ్ ఫిలిం చేశారని అర్థమవుతోంది. మరి, ఆయన చేసిన ఇదే యాడ్ ఫిలింకు సంబంధించిన చెక్కు బౌన్స్ అయ్యిందా.. లేదా.. అనే సంగతిని పక్కన పెడితే.. ఈ సంస్థకు చెందిన కోటా విజయ్ బాబు అనే వ్యక్తి గతంలోనూ ఫార్చ్యూన్ 99 హోమ్స్ పేరిట కొనుగోలుదారుల్ని మోసం చేసిన చరిత్ర ఉంది.
ఈ కోటా విజయ్ బాబు అనే వ్యక్తి.. మూడు, నాలుగేళ్ల క్రితం రోసిరెడ్డి మద్దిరాల అనే వ్యక్తితో కలిసి ఫార్చ్యూన్ 99 హోమ్స్ అనే సంస్థను ఆరంభించి.. ప్రీలాంచ్‌లో ప్లాట్లను విక్రయించాడు. అయితే ఆ వెంచరే ఆరంభం కాలేదంటే.. వీళ్ల మోసం ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసువచ్చు. అందులో ప్లాట్లు కొన్న బాధితులు.. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ ముందు నిల్చోని నిరసన కూడా వ్యక్తం చేశారు. ఆ కేసులో ఫార్చ్యూన్ 99 హోమ్స్ అప్పటి రెరా అథారిటీ నోటీసుని కూడా జారీ చేయడం విశేషం. మరి, ఆ నోటీసుకు జవాబు ఇచ్చారో లేదో రెరాకే తెలియాలి. ఆతర్వాత లావోరా గ్రూప్ అనే మరో కంపెనీతో జత కట్టినా.. ఆ సంస్థ ఏమైందో ఎవరికీ తెలియదు.
అదే కోటా విజయ్ బాబు.. కొంత గ్యాప్ తీసుకుని.. కాస్త అవతారం మార్చి.. సౌత్ హైదరాబాద్‌ని వదిలేసి.. ముంబై రహదారిలోకి అడుగు పెట్టి.. సరికొత్త స్కామ్ కు తెరలేపాడని అర్థమవుతోంది. సంగారెడ్డిలో సాయి దత్తా ఫార్మ్ విల్లే పేరిట సుమారు మూడు వందల ఎకరాల్లో ఫార్మ్ ప్లాట్స్ అంటూ తేర్‌పోల్ అనే విలేజ్‌లో కొత్త డ్రామా మొదలెట్టాడు. సదాశివపేట్‌లో 135 ఎకరాల్లో ధరణి హిల్స్ అనే విల్లా ప్లాట్స్‌ను అమ్మకానికి పెట్టారు. ఇందులో రేటు తక్కువ అంటూ ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి, గత అనుభవాల దృష్ట్యా.. ఈ రెండు వెంచర్లకు ప్రజలు దూరంగా ఉండటమే అన్నివిధాల మంచిది. రెరా అనుమతి లభిస్తే మాత్రం.. ధర ఒకే అనిపిస్తే.. ఆనందంగా కొనండి. అంతేతప్ప, రెరా లేకుండా తీసుకుంటే మాత్రం.. మీరు మోసపోయే ప్రమాదముంది. కాబట్టి, తస్మాత్ జాగ్రత్త.