poulomi avante poulomi avante

ఆనందోత్సాహాల్లో.. అమ‌రావ‌తి రియాల్టీ!

క్రెడాయ్ ఏపీ అధ్య‌క్షుడు
ర‌మ‌ణారావు ఇంట‌ర్వ్యూ

  • ఐదేళ్ల‌లో న‌ష్ట‌పోయిన నిర్మాణ రంగం
  • స‌మ‌స్య‌ల సుడిగుండంలో రియ‌ల్ ప‌రిశ్ర‌మ‌
  • కొత్త ప్ర‌భుత్వం రాక‌తో సానుకూల వాతావర‌ణం
  • అభివృద్ధి దిశ‌గా అమ‌రావ‌తి రియాల్టీ!
  • ఆయా ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తే బెట‌ర్‌
  • ఏపీలో మొత్తం క్రెడాయ్ ఛాప్ట‌ర్లు.. 20

( కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌, 9030034591)

ఏపీలో ఎన్‌డీఏ కూట‌మి అధికారంలోకి రాగానే.. అమ‌రావ‌తిలో పాజిటివ్ మూడ్ ఏర్ప‌డింద‌ని.. రానున్న రోజుల్లో రియాల్టీ రంగానికి బంగారు భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని క్రెడాయ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధ్య‌క్షుడు ర‌మ‌ణారావు ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఇటీవ‌ల రియ‌ల్ ఎస్టేట్ గురుతో ప్ర‌త్యేకంగా మాట్లాడుతూ.. రియ‌ల్ రంగానికి సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్ల‌డించారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యంలో జ‌రిగిన నిర్ల‌క్ష్యాన్ని ఉదాహ‌రించారు. కొత్త‌గా ఏర్పాటైన ప్ర‌భుత్వం రియ‌ల్ రంగాన్ని ప్రోత్స‌హించ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల్ని వివ‌రించారు. మ‌రి, ఆయ‌న ఏమ‌న్నారో ర‌మ‌ణా రావు మాట‌ల్లోనే..

ఎన్నిక‌ల కంటే ఒక నెల ముందు నుంచే ఏపీలో సానుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఈసారి త‌ప్ప‌కుండా టీడీపీ కూట‌మి గెలుస్తుంద‌న్న అంచ‌నాలు పెరిగాయి. అప్ప‌ట్నుంచి రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్లో క‌ద‌లిక‌లు ఏర్ప‌డ్డాయి. ఫ‌లితాలు వెలువ‌డ్డాక సిస‌లైన కార్య‌క‌లాపాలు మొద‌ల‌య్యాయి. మార్పు అనేది రియ‌ల్ ఎస్టేట్ రంగానికి ఊత‌మిస్తుంద‌నే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే, నిర్మాణ రంగం చేసే మొత్తం ట‌ర్నోవ‌ర్‌లో.. ప్ర‌భుత్వానికి సుమారు న‌ల‌భై శాతం దాకా ప‌న్నుల రూపంలో ఆదాయం స‌మ‌కూరుస్తుంది. పైగా, 250 ప‌రిశ్ర‌మ‌లు ఈ రంగంపై ఆధార‌ప‌డ్డాయి. అధిక శాతం మందికి ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల్ని క‌ల్పిస్తుంద‌న్న విష‌యం తెలిసిందే. అయినా, ఈ రంగం గ‌త ఐదేళ్ల‌లో పూర్తిగా నిర్ల‌క్ష్యానికి గురైంది. బిల్డ‌ర్లు అనేక క‌ష్ట‌న‌ష్టాలు ఎదుర్కొన్నారు. చాలా ఇబ్బందులు ప‌డ్డారు. ఇప్పుడిక ప్ర‌భుత్వం మార‌డంతో ప‌రిస్థితులు మెరుగు అవుతాయ‌ని భావిస్తున్నాను.

ప‌డిపోయిన ధ‌ర‌లు మ‌ళ్లీ పైపైకి!

గ‌త ఐదేళ్ల‌లో అమ‌రావ‌తి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో ప్లాట్ల ధ‌ర‌లు అమాంతంగా ప‌డిపోయాయి. దీంతో, అటు రియాల్టీ సంస్థ‌ల్లో మ‌రోవైపు ప్లాట్లు కొన్న‌వారిలో నైరాశ్యం నెల‌కొంది. 2014 నుంచి 2019 దాకా.. విట్ ప్రాంతంలో గ‌జం ధ‌ర పాతిక‌వేలు ఉండేది. అలాంటిది ఐదారు వేల‌కు ప‌డిపోయింది. మారిన ప్ర‌భుత్వం నేప‌థ్యంలో ప్ర‌స్తుతం మ‌ళ్లీ పాత ధ‌ర‌కు చేరుకునే అవ‌కాశ‌ముంది. ఏడాది త‌ర్వాత నిర్మాణ కార్య‌క‌లాపాలు ఊపందుకుంటాయి.

గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. సీడ్ క్యాపిట‌ల్ చేరువ‌లోని మంద‌డం, ఉద్దండ‌రాయునిపాలెం వంటి ప్రాంతాల్లో కొన్ని క్వార్ట‌ర్స్‌ను నిర్మించింది. జ‌డ్జీల‌కు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులు నివ‌సించేలా చేప‌ట్టిన నిర్మాణ ప‌నులు సుమారు 80 నుంచి 90 శాతం పూర్త‌య్యాయి. కాక‌పోతే, వాటిని గ‌త ప్ర‌భుత్వం పూర్తి చేయ‌లేదు. ఇవి పూర్త‌యితే.. ఆయా ప్రాంతాల్లో యాక్టివిటీ పెరిగేందుకు ఆస్కార‌ముంది.

అక్క‌డే గేటెడ్ క‌మ్యూనిటీలు..

గ‌త ఐదేళ్ల‌లో విజ‌య‌వాడ రియాల్టీ మార్కెట్ నిల‌క‌డ‌గానే ఉంది. స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాల‌ని భావించేవారు.. ఈ ప్రాంతంలో ఫ్లాట్ల‌ను కొనుగోలు చేశారు. కాక‌పోతే, టీడీపీ ప్ర‌భుత్వంలో ఉన్నంత ఊపు.. ఈ ప్రాంతంలో గ‌త ఐదేళ్ల‌లో క‌నిపించ‌లేదు. బంద‌రు రోడ్డులోని కానూరు, పోరంకి వంటి ప్రాంతాల్లో.. డ‌బుల్ బెడ్‌రూం ఫ్లాట్లు యాభై నుంచి అర‌వై ల‌క్ష‌ల‌కు అమ్ముడ‌య్యాయి. కంకిపాడు వ‌ర‌కూ యాభై ల‌క్ష‌లకు అటుఇటుగా ఫ్లాట్లు ల‌భించేవి. ఏలూరు రోడ్డులోని గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు దాకా.. చ‌ద‌ర‌పు అడుక్కీ నాలుగు వేల‌కు అటుఇటుగా ఫ్లాట్లు అమ్ముడ‌య్యేవి. కేస‌రిప‌ల్లి, పోరంకి నుంచి నిడ‌మానూరు, విజ‌య‌వాడ ద‌గ్గ‌ర్లోని నున్న ప్రాంతంలో గేటెడ్ క‌మ్యూనిటీ ప్రాజెక్టులు, ల‌గ్జ‌రీ విల్లాల నిర్మాణం జ‌రుగుతోంది.

కొత్త ప్ర‌భుత్వం
వీటిని ప‌రిష్క‌రించాలి!

* గ‌త ఐదేళ్ల‌లో నిర్మాణ రంగం ఎదుర్కొనే స‌మస్య‌ల్ని ప్ర‌భుత్వం పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. వాటి ప‌రిష్కారం మీద దృష్టి సారించ‌లేదు. గ‌త టీడీపీ ప్ర‌భుత్వం హ‌యంలో ఉన్న ఇసుక పాల‌నీని మళ్లీ పున‌రుద్ధ‌రించాలి.

* మాస్ట‌ర్ ప్లాన్ ర‌హ‌దారుల్లో స్థ‌లాల్ని కొల్పోయిన వారికి టీడీఆర్ బాండ్ల‌ను అందజేయాలి. సెట్ బ్యాక్స్‌, మొత్తం ఫ్లోర్ ఏరియాలో రిలాక్సేష‌న్‌ను ఇవ్వాలి.

* గ‌త ప్ర‌భుత్వం కొత్త‌గా రోడ్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. కాక‌పోతే, దాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురాలేదు. ఫ‌లితంగా, టీడీఆర్ బాండ్లు మంజూరు కాలేదు. అందుకే ఖ‌రీదైన ప్రాంతాల్లో భూముల్ని ఇచ్చేందుకు చాలామంది వెన‌క‌డుగు వేసేవారు. త‌ణుకులో టీడీఆర్ బాండ్ల జారీలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని సుమారు వెయ్యి ఫైళ్లకు మోక్షం ల‌భించ‌లేదు. ఈ క్ర‌మంలో.. కొత్త ప్ర‌భుత్వం ఏం చేయాలంటే.. రోడ్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్లాన్‌ను తీసివేసి.. పాత ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేయాలి.

* అర‌వై ఫీట్ల రోడ్డు ఉన్న ప్రాంతంలో నిర్మించే వాణిజ్య స‌ముదాయాల‌పై ఇంపాక్టు ఫీజును వ‌సూలు చేయాల‌న్న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాలి.

* నాన్ లేఅవుట్స్‌లో 14 శాత‌మున్న ఓపెన్ స్పేస్ ఛార్జీల‌ను ఏడు శాతానికి త‌గ్గించాల‌ని గ‌తంలో కోరినా ఫ‌లితం లేకుండా పోయింది. క‌నీసం కొత్త ప్ర‌భుత్వం అయినా మా ఈ విన్న‌పంపై సానుకూల నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని ఆశిస్తున్నాం.

* నాలా ఛార్జీలు అర్బ‌న్‌లో 2 శాతం రూర‌ల్‌లో 3 శాతం ఉండింది. దీన్ని గ‌త ప్ర‌భుత్వం ఐదు శాతానికి పెంచింది. ఈ ఛార్జీల‌ను మూడు శాతానికి తేవాలి.

* ముంబై వంటి ప్రాంతంలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేష‌న్ల‌ను త‌గ్గించ‌డం వ‌ల్ల అక్క‌డి ప్ర‌భుత్వానికి గ‌ణ‌నీయ‌మైన రాబ‌డి ల‌భించింది. గ‌త ఐదేళ్లలో జ‌రిగిన న‌ష్టాన్ని దృష్టిలో పెట్టుకుని.. కొత్త ప్ర‌భుత్వం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేష‌న్ ఛార్జీల‌ను త‌గ్గించాలి. దీని వ‌ల్ల రిజిస్ట్రేష‌న్ల సంఖ్య పెరిగి.. ప్ర‌భుత్వానికి అధిక ఆదాయం ల‌భిస్తుంది.

* యాభై శాతమున్న వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్‌ను త‌గ్గించాలి.

* అనుమ‌తుల్లో సుల‌భ‌త‌ర వాణిజ్య విధానాన్ని అమ‌లు చేయాలి. ఇందుకోసం సింగిల్ విండో సిస్ట‌మ్‌ను అమ‌ల్లోకి తెచ్చి.. ఫీజులన్నీ ఒకేసారి క‌ట్టే విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టాలి. దీని వ‌ల్ల బిల్డ‌ర్ల‌కు స‌మ‌యం క‌లిసొస్తుంది. ప్ర‌భుత్వ ఆఫీసుల చుట్టూ చెప్పుల‌రిగేలా తిరిగే అవ‌స్థ త‌ప్పుతుంది.

* అమ‌రావ‌తిలో కానీ మంగ‌ళ‌గిరిలో కానీ మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల‌ను అభివృద్ధి చేయాలి. విద్యుత్తు, డ్రైనేజీ వంటి సౌక‌ర్యాల్ని పొందుప‌ర్చాలి.

* ప్ర‌భుత్వం నిర్మించే రెసిడెన్షియ‌ల్‌, క‌మ‌ర్షియ‌ల్ భ‌వ‌నాల ప‌నిని ప్రైవేటు బిల్డ‌ర్ల‌కు అప్ప‌గించాలి. ప్ర‌భుత్వ‌ప‌ర‌మైన అభివృద్ధి ప‌నుల్ని అనుభ‌వ‌జ్ఞులైన డెవ‌ల‌ప‌ర్ల‌కు అప్ప‌గిస్తే.. నాణ్య‌త‌తో కూడుకున్న‌ ప‌ని స‌కాలంలో పూర్త‌వుతుంది.

ఇక్క‌డ ఇన్వెస్ట్ చేయండి

ఏపీలో.. ప్లాట్ల‌లో పెట్టుబ‌డి పెట్టాల‌ని భావించేవారికి అమ‌రావ‌తిలోని సీడ్ క్యాపిట‌ల్ ప్రాంతం మంచి ఏరియా అని అనుకోవ‌చ్చు. అక్క‌డ కొంటే రానున్న రోజుల్లో మంచి అప్రిసియేష‌న్‌ను అందుకోవ‌చ్చని గుర్తుంచుకోండి.

ప్రెసిడెంట్ గురించి క్లుప్తంగా..

క్రెడాయ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధ్య‌క్షుడు ర‌మ‌ణారావు 1992 నుంచి నిర్మాణ రంగంలో ఉన్నారు. ఆయ‌న సంస్థ‌ల పేర్లు సిరి డెవ‌ల‌పర్స్, ఆర్3 ప్ర‌మోట‌ర్స్ పేరిట ప‌లు ప్రాజెక్టుల్ని చేపట్టారు. ఇప్ప‌టివ‌ర‌కూ సుమారు 35 ప్రాజెక్టుల్ని నిర్మించారు. ప్ర‌స్తుతం తాడేప‌ల్లిలో ఎక‌రంన్న‌ర స్థ‌లంలో 95 ఫ్లాట్లు, ఈడుపుగ‌ల్లులో 2 ఎక‌రాల్లో 170 ఫ్లాట్ల‌ను నిర్మిస్తున్నారు. ఒక ఆస్ప‌త్రిని కూడా క‌డుతున్నారు.

క్రెడాయ్ ఏపీలో..

క్రెడాయ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సుమారు ఇర‌వై ఛాప్ట‌ర్లు ఉన్నాయి. అందులో 1300 మంది స‌భ్యులున్నారు. శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం, న‌ర్సిప‌ట్నం, తుని, అన‌కాప‌ల్లి, రాజ‌మండ్రి, కాకినాడ‌, భీమ‌వ‌రం, ఏలూరు, విజ‌య‌వాడ‌, మ‌చిలీపట్నం, గుంటూరు, తిరుప‌తి, ఒంగోలు, నెల్లూరు, నంద్యాల, క‌ర్నూలు, క‌డ‌ప‌, అనంత‌పురం వంటి ప్రాంతాల్లో ఛాప్ట‌ర్లున్నాయి. ఇందులో క్యాపిట‌ల్ ఏరియాను మిన‌హాయిస్తే.. మిగ‌తా అన్ని ఛాప్ట‌ర్ల ప‌రిధిలో రియ‌ల్ ఎస్టేట్ రంగం ఫ‌ర్వాలేదు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles