ఏపీ రాజధానిగా అమరావతి, ఫైనాన్షియల్ రాజధానిగా వైజాగ్ కొనసాగుతుందని ఏపీ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అమరావతి వల్ల హైదరాబాద్ రియాల్టీ మీద ప్రతికూల ప్రభావం పడుతుందనే వార్తలు కరెక్టు కాదని గుర్తుంచుకోండి.
ఎందుకంటే, హైదరాబాద్ రాత్రికి రాత్రే అభివృద్ధి చెందలేదు. ముఖ్యంగా, ఐటీ రంగాన్ని తీసుకుంటే.. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదేళ్లు, కాంగ్రెస్ పాలన పదేళ్లు, బీఆర్ఎస్ పాలన పదేళ్లు.. ఇలా ఇరవై ఐదేళ్ల పాటు ప్రతి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల హైదరాబాద్‌లో ఐటీ రంగం గణనీయంగా వృద్ధి చెందింది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ విచ్చేసి నేరుగా తమ కార్యకలాపాల్ని ఆరంభించేలా ఐటీ సముదాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పరిస్థితి ప్రస్తుతం అమరావతిలో అందుబాటులో లేదని గుర్తుంచుకోవాలి. పైగా, ఇక్కడి వాతావరణం ప్రతిఒక్కరికీ నచ్చుతుంది. శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయి. నగరానికొచ్చే కొత్త వారితోనైనా ప్రజలెంతో స్నేహపూర్వకంగా ఉంటారు. షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, పబ్బులు.. ఒక మోడ్రన్ లైఫ్ స్టయిల్ కోరుకునేవారికి హైదరాబాద్ అమితంగా నచ్చుతుంది.
అమరావతిలో ఇవన్నీ డెవలప్ అయ్యేందుకు కొంతకాలం పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి, అమరావతి ఏర్పాటు కావడం వల్ల.. హైదరాబాద్‌కు తక్షణమే వచ్చే నష్టమేం లేదు. కాకపోతే, గత ఐదేళ్లుగా అమరావతిలో నష్టపోయిన బిల్డర్లు.. ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి రావడం వల్ల.. అందులో నుంచి లాభాలతో బయట పడతారు. కొత్తగా రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ఆరంభమవుతాయి. అవన్నీ ఐదేళ్లలోపే పూర్తయ్యేలా డెవలపర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తానికి,అమరావతి రాజధాని పనులు వీలైనంత త్వరగా పూర్తి కావాలని రియల్ ఎస్టేట్ గురు కోరుకుంటోంది.