రెండేళ్లలో 13 శాతం పెరుగుదల
అనరాక్ నివేదిక వెల్లడి
దేశంలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత రెండేళ్లలో ఇళ్ల ధరలు 13 శాతం మేర పెరిగాయి. అదే సమయంలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణం 1.3 శాతం పెరిగింది. 2022లో ఓ ఇంటి సగటు ధర చదరపు అడుగుకు రూ.5,881 ఉండగా.. ద్రవ్యోల్బణం 5.5 శాతం ఉంది. 2023లో ద్రవ్యోల్బణం 6.7 శాతం వద్ద ఉండగా.. ఇంటి ధర చదరపు అడుగుకు రూ.6,325కి పెరిగింది. అలాగే 2024లో ద్రవ్యోల్బణం 5.4 శాతం వద్ద ఉండగా.. రెసిడెన్షియల్ బిల్డింగ్ ధర చదరపు అడుగుకు ఏకంగా రూ.7,550కి ఎగబాకింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొందని అనరాక్ తాజా నివేదిక వెల్లడించింది. 2019 ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు వార్షిక ప్రాతిపదికన 6 శాతం పెరగా పెరిగాయి. 2014 ఎన్నికల్లో తర్వాత కూడా ఇదే పరిస్థితి కనిపించింది.
2013తో పోలిస్తే 2014లో ఇళ్ల ధరలు 6 శాతం ఎక్కువయ్యాయి. 2013లో ఇంటి ధర చదరపు అడుగుకు రూ.4,895 ఉండగా.. 2014లో అది రూ.5,168కి పెరిగింది. 2013 నుంచి 2020 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 20.68 లక్షల ఇళ్లకు డిమాండ్ ఉండగా.. రికార్డు స్థాయిలో 23.55 లక్షల ఇళ్లు సరఫరా అయ్యాయి. దీనివల్ల ధరలు మరీ అంత ఎక్కువగా పెరగలేదని అనరాక్ నివేదిక విశ్లేషించింది.